‘విభజన’ వేగం పెంచండి

14 Feb, 2016 00:42 IST|Sakshi
‘విభజన’ వేగం పెంచండి

కేంద్ర హోంమంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన అంశాల అమలు ఇంకా మిగిలే ఉందని, సాధ్యమైనంత త్వరగా వాటిని అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రాజ్‌నాథ్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్... ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అధికారుల విభజన వివిధ స్థాయిల్లో ఇంకా పూర్తవలేదు. సంబంధిత విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ కొత్త రాష్ట్రమైనందున అధికారుల కొరతతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అఖిల భారత సర్వీసు అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ఎవరైనా డెప్యుటేషన్‌పై రాదలిస్తే త్వరితగతిన సంబంధిత అభ్యర్థనలను సానుకూలంగా పరిష్కరించండి. తెలంగాణలో నగర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఐపీఎస్ అధికారుల సంఖ్యను 112 నుంచి 141కు పెంచాలి’’ అని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిపి అసెంబ్లీ స్థానాలను పెంచాలని, ఇందుకు వీలుగా రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలన్నారు.

అంతకుముందున్న చట్టాలతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పెంపు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘‘రెండు రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ ఉన్న సంగతిని హోంమంత్రి ప్రస్తావించారు. ఈ సమావేశాల్లోనే చట్ట సవరణకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు’’ అని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి సమావేశ వివరాలు వెల్లడించారు. అలాగే గోదావరి, ప్రాణహిత నదుల వెంట ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ 330 కి.మీ. మేర నిర్మించ తలపెట్టిన రహదారికి అన్ని అనుమతులిచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. ఈ భేటీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశ వరావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.

 కేసీఆర్‌కు అపూర్వ ఆదరణ: జితేందర్‌రెడ్డి
 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాని, కేంద్ర మంత్రులు అపూర్వంగా ఆదరించారని...ఇప్పటివరకు విన్నవించిన సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించే పరిస్థితి కనిపిస్తోందని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హోంమంత్రితో ముఖ్యమంత్రి, ప్రతినిధి బృందం భేటీ అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. విభజన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.  
 
 హైకోర్టును విభజించాలని సీజేఐకి వినతి

 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టు విభజన జరపాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ టి.ఎస్. ఠాకూర్‌ను కలిశారు. హైకోర్టు విభజించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సూచనల మేరకు తొలుత తాము తెలంగాణ హైకోర్టు కోసం గచ్చిబౌలిలో తాత్కాలిక వసతిని గుర్తించామని, ఆ ప్రతిపాదనలను పంపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని...ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనాలు నిర్మాణమయ్యేంతవరకు తామేమీ చేయలేమన్న రీతిలో వ్యవహరిస్తోందని సీఎం వివరించినట్టు సమాచారం. అందువల్ల ప్రత్యేక హైకోర్టు ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. జూనియర్ సివిల్ జడ్జి, ఇతర న్యాయాధికారుల నియామకాలను కూడా హైకోర్టు విభజన జరిగే వరకు చేపట్టరాదని సీజేఐకి కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు తెలియ వచ్చింది.

మరిన్ని వార్తలు