ట్విట్టర్‌లో గుడ్‌న్యూస్ చెప్పిన కేజ్రీవాల్‌!

22 Feb, 2016 19:48 IST|Sakshi
ట్విట్టర్‌లో గుడ్‌న్యూస్ చెప్పిన కేజ్రీవాల్‌!

న్యూఢిల్లీ: జాట్ల రిజర్వేషన్‌ ఆందోళనల నేపథ్యంలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ఓ గుడ్‌ న్యూస్ చెప్పారు. మునాక్ కాలువను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకోవడంతో త్వరలోనే ఢిల్లీకి తాగునీటి సమస్యలు తీరిపోతాయని తెలిపారు. తమను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న జాట్లు ఢిల్లీ కీలక మంచినీటి వనరైన మునాక్ కాలువను నిర్భందించారు. దీంతో తాగునీరు అందక ఢిల్లీ వాసులు అల్లాడుతున్న సంగతి తెలిసిందే.

దీనిపై ఓవైపు కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో పరిష్కారాన్ని కోసం ప్రయత్నించకుండా.. చేతులు కట్టుకొని కూర్చోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. ఈ నేపథ్యంలోనే జాట్లు నిర్బంధించిన మునాక్ కాలువను ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకోవడం.. తాగునీటి సరఫరాకు లైన్ క్లియర్ చేయడంతో ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇది ఢిల్లీవాసులకు శుభవార్త అని ఆయన చెప్పారు. అయితే ఈ కాలువ లైనింగ్ దెబ్బతిందో? లేదో పరీక్షించి వీలైనంత త్వరగా ప్రజలకు నీటిని అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన తాగునీటి సమస్య కారణంగా ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు