‘నా కుమారుడి సాక్షిగా రుణమాఫీ చేస్తాం’

29 Dec, 2018 09:50 IST|Sakshi

ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భావోద్వేగం

సాక్షి బెంగళూరు: రుణమాఫీ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం భాగల్‌కోటె జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుల రుణ విముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనకు ఉన్న ఒక్క కుమారుడు నిఖిల్‌ సాక్షిగా రైతుల రుణాలను మాఫీ చేస్తానని ఉద్వేగ భరితంగా మాట్లాడారు. తనకు ఒక్కడే కుమారుడని.. ఆయనపై ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని చెప్పారు. రైతుల రుణమాఫీ చేసి తీరుతానని భరోసా ఇచ్చారు. రుణమాఫీ విషయంలో ఎవరినీ మోసం చేయబోమని చెప్పారు.

తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందన్నారు. వచ్చే ఏడాది నుంచి పంటలకు నికర ధరలు ఉంటాయన్నారు. మహారాష్ట్ర తరహాలో చేయాలని చెరకు రైతులు చెబుతున్నారు. మీరే (రైతులు) మహారాష్ట్ర వెళ్లి చూసిరావాలన్నారు. ఈమేరకు రెండు రోజుల క్రితం ఢిల్లీలో రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమై రానున్న రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీలకు అనుమతి కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రుణ విముక్తి పత్రాలు భాగల్‌కోటె – 96, బాదామి – 422, హునగుంద – 274, జమఖండి – 1,198, ముధోళ – 450, బీళగి – 356 కలిపి మొత్తం 2,796 మంది రైతులకు రుణ విముక్తి పత్రాలు అందజేశారు.   
 

>
మరిన్ని వార్తలు