అరుణాచల్‌లో కమల వికాసం

1 Jan, 2017 01:51 IST|Sakshi
అరుణాచల్‌లో కమల వికాసం

నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ సర్కారు ఏర్పాటు

- ఆ పార్టీలో చేరిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు
- సీఎం పెమా ఖండూ నేతృత్వంలోని 33 మంది ఎమ్మెల్యేల చేరిక
- రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపీలో చేరామన్న ముఖ్యమంత్రి

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో శనివారం అత్యంత నాటకీయ పరిణామాలు సంభవించాయి. శరవేగంగా మారిన రాజకీయ పరిణామాల మధ్య రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌(పీపీఏ)కు చెందిన 33 ఎమ్మెల్యేలతో కలసి ముఖ్యమంత్రి పెమా ఖండూ బీజేపీలో చేరడంతో ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది. గత గురువారం పీపీఏ నుంచి  ఖండూను  సస్పెండ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ అంకానికి తెరలేచింది. తనకు మద్దతిస్తున్న 33 మంది ఎమ్మెల్యేల(పీపీఏకు మొత్తం 43 మంది సభ్యులున్నారు)తో ఖండూ శనివారం శాసనసభ స్పీకర్‌ టెన్‌జింగ్‌ వద్ద బలప్రదర్శన నిర్వహించారు. వారిని బీజేపీ సభ్యులుగా స్పీకర్‌ గుర్తించారు. 60 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం 11 మంది సభ్యులున్నారు.

కమలం వికసించింది
బీజేపీలో చేరాక సీఎం అసెంబ్లీ ఆవరణలో మాట్లాడారు. రాష్ట్రంలో కమలం వికసించిందన్నారు. కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త ఏడాదిలో సరికొత్త అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు చూడనున్నారన్నారు. ఏళ్లుగా కాంగ్రెస్‌ దుష్పరిపాలన కారణంగా రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధీ లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర పురోగతికోసం తాము పీపీఏలో చేరామని, అయితే అక్కడ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించారని చెప్పారు.

శరవేగంగా మారిన పరిణామాలు..
ఈశాన్య ప్రజాతంత్ర కూటమి(ఎన్‌ఈడీఏ) సంకీర్ణ ప్రభుత్వంలో పీపీఏ భాగస్వామి. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఖండూతోపాటు మరో ఆరుగురిని పీపీఏ అధ్యక్షుడు గురువారం  తాత్కాలికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్‌ చేశార. కొత్త సీఎంగా తకమ్‌ పారియోను ప్రకటించారు. తొలుత మెజారిటీ పీపీఏ ఎమ్మెల్యేలు పారియోకే మద్దతు పలికారు. తదుపరి వారంతా  మనసు మార్చుకుని ఖండూవైపు మొగ్గారు. ఖండూ గత సెప్టెంబర్‌లో 42 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ నుంచి బయటకు రావడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పీపీఏ శనివారం మరో నలుగురిని సైతం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అరుణాచల్‌ బీజేపీ పాలిత పదవ రాష్ట్రమని, కూటమిపరంగా 14వ రాష్ట్రమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేల్ని బీజేపీ హైజాక్‌ చేసిందని  పీపీఏ వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు