సీఎం ఆఫీసుకు మరోసారి కరోనా సెగ

10 Jul, 2020 14:27 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి మరోసారి కరోనా సెగ  తాకింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్వీయ నియంత్రణలోకి వెళ్లారు.  సీఎం ఆఫీసు 'కృష్ణ'లో పనిచేసే సిబ్బందికి వైరస్‌ పాజిటివ్ రావడంతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. రానున్న కొద్దిరోజులు ఆయన ఇంటినుంచే పని చేయనున్నారు.  బెంగళూరు డాలర్ కాలనీలోని తన వ్యక్తిగత నివాసంలో సీఎం బస చేయనున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి.

తన అధికారిక నివాసంలో పనిచేసే డ్రైవర్‌తో పాటు, ఇతర ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినందువల్ల, తాను ఇంటి నుండే వీడియో కాల్స్ ద్వారా కొన్ని రోజులు పని చేస్తానని సీఎం ప్రకటించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ దయచేసి పని చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, శారీరక దూరం కొనసాగించండి , తప్పనిసరిగా మాస్క్‌లో ధరించాలి  అని సూచిస్తూ యడియూరప్ప  ఒక ప్రకటన విడుదల చేశారు. (కరోనాతో మరో ముప్పు)

కాగా సీఎం ఆఫీసులో జూన్19న ఒక ఉద్యోగి, జూన్ 25న  మరో నలుగురు సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ సందర్భంగా శానిటైజేషన్‌ నిమిత్తం ఆఫీసును మూసివేసి, తిరిగి  ప్రారంభించిన సంగతి తెలిసిందే. గురువారం రికార్డు స్థాయిలో 2228 కేసులు నమోదు కావడంతో కర్ణాటక రాష్ట్రంలోని కోవిడ్-19 కేసుల సంఖ్య 31105కు పెరిగింది.

మరిన్ని వార్తలు