‘జాగ్రత్తగా ఉంటారా.. మరోసారి లాక్‌డౌన్‌ విధించాలా’

25 Jun, 2020 12:42 IST|Sakshi

బెంగళూరు: రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ కేసులు‌ పెరుగుతుండటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప బెంగళూరు వాసులను గురువారం హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా లేదా మరోసారి లాక్‌డౌన్‌ విధించమంటారా? అని ప్రజలపై ఆసహనం వ్యక్తం చేశారు. తిరిగి లాక్‌డౌన్‌ విధించకుండా ఉండాలంటే తప్పసరిగా భౌతిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. (‘20 రోజులు లాక్‌డౌన్‌ విధించాలి’) 

కరోనా నివారణ చర్యలపై చర్చించేందుకు అధికారులతో యడియూరప్ప సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలో బెంగళూరు కూడా ఒకటి. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 418 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో‌ ఇప్పటి వరకు మొత్తం 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894కు చేరింది. 2,71,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (ఆ 4 రాష్ట్రాల ప్రయాణీకులపై నిషేధం!)

మరిన్ని వార్తలు