రాష్ట్రాలు అభివృద్ధి కానిదే దేశాభివృద్ధి సాధ్యం కాదు

7 Dec, 2014 16:54 IST|Sakshi
రాష్ట్రాలు అభివృద్ధి కానిదే దేశాభివృద్ధి సాధ్యం కాదు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ... దేశానికి అవసరమైన విధానాలు రూపొందించేలా వ్యవస్థ ఉండాలని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నూతన ప్రణాళికలు ఉండాలని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి కానిదే దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రణాళిక విధానంలో కింది నుంచి పైస్థాయి వరకు మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రణాళికా సంఘం స్థానంలో సుస్థిరమైన సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవశ్యకతను మోదీ ఈ సందర్భంగా వివరించారు.

ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటుపై మోదీ తన నివాసంలో ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమైయ్యారు.  ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటుపై వారితో మోదీ చర్చించారు. ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శుల సలహాలు, సూచనలను మోడీ పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ సీఎంలు ఈ సమావేశానికి హాజరుకాలేదు.

మరిన్ని వార్తలు