13సార్లు ప్రయత్నించి సైన్యంలో చేరిన ఆయన...

4 May, 2020 15:00 IST|Sakshi

జైపూర్‌: ఆరున్నర సంవత్సరాలు కష్టపడి 13 సార్లు ప్రయత్నించి ఆర్మీలో చేరారు ఆయన. దేశం కోసం పోరాడాలి అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన లేని ఆయన ఎ‍ట్టకేలకు ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరారు. భారత సైన్యం నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆర్మీలో చేరిన తరువాత వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కల్నల్‌స్థాయికి చేరారు. ఆయన మరెవరో కాదు ఆదివారం  జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఉగ్రదాడిలో అమరులైన కల్నల్‌ ఆశుతోష్‌ శర్మ. ఆయన మృతదేహాన్నిస్వగ్రామమైన జైపూర్‌కు తీసుకురానున్నారు. సోమవారం సాయంత్రం కల్లా ఆయన శరీరాన్ని జైపూర్‌లో ఉంటున్న ఆయన తల్లిదండ్రులకు అందించనున్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు సైనికవందనంతో జరగనున్నాయి. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం)

కల్నల్‌ శర్మ భార్య పల్లవి, కూతురు తమన్నాతో కలిసి ఉంటున్నారు. ఆయన భార్య పల్లవి మాట్లాడుతూ తన భర్త ఒక గొప్ప కారణంతో ప్రాణాలు త్యాగం చేశారని, అశుతోష్‌ని చూసి గర్వపడుతున్నానని తెలిపారు. ఆయనని చూసి ఏడవనని తెలిపారు. చివరిగా కల్నల్‌తో మే 1 న మాట్లాడానని చెప్పారు. ఆయన కూతురు తమన్నా మాట్లాడుతూ ఆపరేషన్‌ ముగియగానే ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన నాన్నకి ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అయ్యింది. అశుతోష్‌ తల్లి దండ్రులు మాట్లాడుతూ తమ కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. (హంద్వారా అమరులకు మహేష్ నివాళి)

ఆయన సోదరుడు పీయూష్‌ శర్మ మాట్లాడుతూ ‘మా సోదరుడు చాలా ధైర్యవంతుడు, దేశభక్తి కలవాడు. నా సోదరుడి లాగానే నా కొడుకు కూడా ఆర్మీలో జాయిన్‌ అవ్వాలనుకుంటున్నాడు. ఆయన మా అందరికి ఆదర్శం’ అని తెలిపారు. కల్నల్‌ అశుతోష్‌ శర్మ స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌ కాగా ఆయన అంత్యక్రియలు మాత్రం జైపూర్‌లో జరగనున్నట్లు ఆయన సోదరుడు తెలిపారు. ఆదివారం కశ్మీర్‌లోని హాంద్వారా ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో ఒక కల్నల్‌, ఒక మేయర్‌, ఇద్దరు జవాన్లతో పాటు జమ్మూకశ్మీర్‌ పోలీసు ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు