రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..

22 Jun, 2020 04:58 IST|Sakshi

కల్నల్‌ సంతోష్‌ బాబు వీరోచిత పోరాటం

వెల్లడించిన ఆర్మీ వర్గాలు

న్యూఢిల్లీ: దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్‌ సంతోష్‌బాబు వీరోచిత పోరాటం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారతీయ సైనికుల్ని ముందుండి నడిపించిన ఆయనలో నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి జై కొట్టాలి. సంతోష్‌బాబు ఎంతటి తెగువ చూపించారో ఒక ఆర్మీ అధికారి జాతీయ చానెల్‌తో పంచుకున్నారు. కల్నల్‌ ఎలా ముందుకు సాగారంటే....

ఇండియన్‌ ఆర్మీ 16 బిహార్‌ బెటాలియన్‌కు సంతోష్‌ బాబు కమాండింగ్‌ ఆఫీసర్‌ (సీఓ)గా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 6న ఇరుపక్షాల సైనికుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో గల్వాన్‌ లోయలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 దగ్గర నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. చైనా తన శిబిరాన్ని తీసేసి సైన్యాన్ని వెనక్కి పిలిచింది. కానీ హఠాత్తుగా జూన్‌ 14 రాత్రి మళ్లీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే సంతోష్‌ బాబు, చైనా కమాండింగ్‌ ఆఫీసర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చాక మళ్లీ తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఆ తర్వాత చైనా సైనికులు వెనక్కి మళ్లారన్న సమాచారం అందింది. ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కల్నల్‌ స్వయంగా గల్వాన్‌ లోయకు బయల్దేరారు. ఇలాంటి పరిస్థితుల్లో మేజర్‌ ర్యాంకు అధికారిని పంపి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని చెప్పి ఉండొచ్చు. కానీ సంతోష్‌బాబు ఆ పని చేయలేదు. డ్రాగన్‌ సైన్యం వెనక్కి వెళ్లి ఉండదన్న అనుమానంతో సైనికుల్ని తీసుకొని వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు చైనా సైనికుల కొత్త ముఖాలు కనిపించాయి. ఎంతో మర్యాదగానే కల్నల్‌ సంతోష్‌ బాబు వారితో సంభాషణ మొదలు పెట్టారు. మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీనికి జవాబుగా సైనికులు సంతోష్‌ బాబుపై రాళ్ల వర్షం కురిపించారు. ఇరుపక్షాల మధ్య 30 నిమిషాల సేపు ఘర్షణలు జరిగాయి.

చైనా శిబిరాల్ని భారత జవాన్లు నాశనం చేశారు. ఈ దాడుల్లో సంతోష్‌బాబు తీవ్రంగా గాయపడినా వెనుకడుగు వేయలేదు. గాయపడిన ఇతర జవాన్లను వెనక్కి పంపేస్తూ తానే సింహంలా ముందుకు ఉరికారు. అంతలోనే అటువైపు నుంచి మరికొందరు ఇనుప రాడ్లతో, కొత్త తరహా ఆయుధాలతో భారతీయ సైనికులపై దాడి చేశారు. కల్నల్‌ అనుమానం నిజమైంది. చైనా పథకం ప్రకారమే సైన్యాన్ని అక్కడ దింపిందని అర్థమైంది. మళ్లీ ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద రాయి వచ్చి కల్నల్‌ తలకి గట్టిగా కొట్టుకోవడంతో ఆయన గల్వాన్‌ నదిలో పడిపోయారు. పోరు ముగిశాక సంతోష్‌బాబుతో సహా చాలా మంది జవాన్లు నిర్జీవంగా నదిలో ఉన్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండిచేశాయి. చాలాసేపు అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణమే నెలకొందటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి వివరించారు.

మరిన్ని వార్తలు