కాలేజీకి చీరలోనే రావాలి

8 Mar, 2018 18:26 IST|Sakshi

రాజస్తాన్ ప్రభుత్వం సరికొత్త నిబంధన

వచ్చే విద్యా సంవత్సరం నుంచి డ్రెస్ కోడ్

జైపూర్‌: రాజస్తాన్ ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. కాలేజీలో చదివే అమ్మాయిలు జీన్స్‌, టీ షర్ట్స్‌, లెగ్గిన్స్‌ లాంటి దుస్తులు ధరించి కాలేజీకి రావొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. సంప్రదాయ దుస్తులు సల్వార్‌-కమీజ్‌, చీరలో మాత్రమే కాలేజీకి హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌ అన్ని ప్రభుత్వ కాలేజీలకు లేఖలు పంపింది. కళాశాలల ప్రిన్సిపాల్స్.. బాలుర, బాలి కల దుస్తుల రంగు (డ్రెస్ కోడ్ కలర్)ను నిర్ణయించి ఈ నెల 12నాటికి తుది నివేదికను పంపాలని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది.

విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నంత కాలం డ్రెస్‌ కోడ్‌ వర్తిస్తుంది. అయితే బోధనా సిబ్బందికి డ్రెస్‌ కోడ్‌పై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేశారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులు, టీచర్లు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది తిరోగమ చర్య అని, ఏ డ్రెస్‌ వేసుకోవాలో చెప్పి తమ హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ హిస్టరీ ప్రొఫెసర్‌ మాట్లాడుతూ.. ప్రపంచం ఒక అడుగు ముందుకు సాగితే, భారత్ రెండు అడుగులు వెనక్కి వేస్తోందంటూ అభిప్రాయపడ్డారు. కనోరియా కాలేజీకి చెందిన విద్యార్థిని అంజలీ మాట్లాడుతూ.. ‘మాకు ఇప్పుడే స్వేచ్ఛ ఉంటుంది. పెళ్లి తర్వాత మేము జీన్స్‌, టీ షర్ట్స్‌ ధరించే చాన్స్‌ ఉండకపోవచ్చు. అప్పుడు మాకు అంత ఫ్రీడమ్‌ ఉండదు. ఇప్పుడు కూడా మా ఇష్టం వచ్చిన డ్రెస్‌ ధరించొద్దు అనడం విచారకరమని’ అన్నారు. 

మరో విద్యార్థిని మాట్లాడుతూ.. అబ్బాయిలను కుర్తా పైజామా వేసుకురావాలని ఎందుకు బలవంతం చేయడం లేదు? స్త్రీ, పురుషులు సమానం అనే ప్రభుత్వం స్త్రీలపై మాత్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. డ్రెస్‌ కోడ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. ‘బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోంది. వీరు డాక్లర్లు, ఇంజనీర్లను కోరుకోవడం లేదు. బాబాలను తయారు చేయాలని చూస్తోంద’ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గోవింద్‌ సింగ్‌ ఆరోపించారు. కాగా డ్రెస్‌ కోడ్‌ అమలును ప్రభుత్వం సమర్థించుకుంది. క్యాంపస్‌లో క్రమశిక్షణ పెంపొందించడం కోసమే డ్రెస్‌కోడ్‌ అమలు చేస్తున్నామని పేర్కొంది. కళాశాల ప్రిన్సిపల్‌, నిర్వాహకులు కాలేజీ సంఘాలతో చర్చలు జరిపి, వారు ఏకాభిప్రాయానికి వచ్చాకే డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తారని అధికారులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు