సుప్రీంకోర్టు జడ్జీలుగా ఇద్దరికి పదోన్నతి!

13 Jan, 2019 04:35 IST|Sakshi
జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో జనవరి 10న సమావేశమైన కొలీజియం వీరిద్దరికి పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్‌ 12న అప్పటి కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని తాజా సమావేశంలో న్యాయమూర్తులు సమర్థించారు. ‘సుప్రీంకోర్టు జడ్జీలుగా సిఫార్సు చేసిన వ్యక్తులు అన్నివిధాలుగా అర్హులైనవారు, సమర్థులు’ అని కొలీజియం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌తో పాటు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు