కల్నల్‌ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం

4 May, 2020 04:36 IST|Sakshi
వీర మరణం పొందిన కల్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్

ఉగ్రవాదులతో హోరాహోరీ ఎదురు కాల్పులు

ఇద్దరు ముష్కరులూ హతం

శ్రీనగర్‌: దేశమంతటా లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ..కశ్మీర్‌లో సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో కల్నల్, మేజర్‌ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు నేలకొరిగారు.  శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువజాము వరకు కొనసాగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ముష్కరులు కూడా హతమయ్యారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా ఉంచుకున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో కల్నల్‌ శర్మ, పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఇంటిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జవాన్లు ప్రాణాలకు తెగించి బందీలను, గ్రామస్తులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.

అనంతరం కల్నల్‌ శర్మ నేతృత్వంలోని బృందం లోపలికి చొచ్చుకెళ్లింది. కానీ, లోపలే పొంచి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే నేలకొరిగారు. వెలుపల వేచి చూస్తున్న బలగాలకు కల్నల్‌ శర్మ బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారికి చేసిన ఫోన్‌ కాల్స్‌కు ఉగ్రవాదులు సమాధానం ఇవ్వడంతో ప్రమాదాన్ని శంకించారు. ఆ వెంటనే లోపలికి వెళ్లిన పారాట్రూపర్లు ఇద్దరు ఉగ్రవాదులను మట్టికరిపించారు. నేలకొరిగిన కల్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్, నాయక్‌ రాజేశ్, లాన్స్‌ నాయక్‌ దినేశ్‌లు 21 రాష్ట్రీయ రైఫిల్స్‌లోని గార్డ్స్‌ రెజిమెంట్‌కు చెందిన వారు.

వీరితోపాటు  లోపలికి వెళ్లిన జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ షకీల్‌ కాజీ కూడా బలయ్యారు. ఉగ్రహతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్, పాక్‌కు చెందిన హైదర్‌ కాగా, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నాడు. కాల్పులు జరుగుతుండగా మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. వీరంతా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడే ఉగ్రవాదుల కోసం అక్కడ వేచి ఉన్నట్లు అనుమానిస్తున్నామని సైన్యం తెలిపింది. ఇదే ఉగ్రవాదుల ముఠాతో గురువారం సాయంత్రం కూడా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయనీ, అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపింది.
    
అప్పటి నుంచి ఇక్కడ గాలింపు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నేలకొరిగిన జవాన్ల అంత్యక్రియలు సోమవారం వారివారి స్వస్థలాల్లో జరగనున్నాయని పేర్కొంది. కల్నల్‌ అశుతోష్‌ శర్మ భౌతిక కాయాన్ని సొంతూరు జైపూర్‌కు, మేజర్‌ అనూజ్‌ సూద్‌ భౌతిక కాయాన్ని పుణేకు అధికారులు తరలించారు. కాగా, కశ్మీర్‌లోయలో కల్నల్‌ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం 2015 తర్వాత ఇదే ప్రథమం. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భద్రతాబలగాల త్యాగాలు జాతి మరువలేనివని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

నాయక్‌ రాజేశ్, లాన్స్‌ నాయక్‌ దినేశ్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.ఎ.ఖాజీ (ఫైల్‌ ఫొటోలు, ఎడమ నుంచి కుడికి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు