మానవ తప్పిదంతోనే ‘కొలంబియా’ దుర్ఘటన

17 Feb, 2017 02:18 IST|Sakshi

న్యూఢిల్లీ:  2003లో భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్త కల్పనా చావ్లా సహా ఏడుగురిని బలిగొన్న  కొలంబియా రోదసి నౌక కుప్పకూలడంలో సాంకేతిక లోపాలు లేవని,  మానవ అంచనాల్లో తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఇస్రో మాజీ చైర్మన్  మాధవన్  నాయర్‌ అన్నారు. గురువారం ఇక్కడ అబ్జర్వేటరీ రీసెర్చీ ఫౌండేషన్  (ఓఆర్‌ఎఫ్‌) మూడో వార్షిక కల్పనా చావ్లా అంతరిక్ష విధాన డైలాగ్‌ను ఆయన ప్రారంభించారు. ప్రయోగానికి ముందు కొలంబియా నౌకలో దెబ్బతిన్న భాగాన్ని గుర్తించినా, దాన్ని తేలిగ్గా తీసుకున్నారని, అదే ప్రమాదానికి కారణమైందన్నారు.

‘నౌక రక్షణ కవచం బ్రీఫ్‌కేస్‌ పరిమాణంలో విరిగిపోయి, దాని ఉష్ణ రక్షణ వ్యవస్థను దెబ్బతీసింది. నౌక ప్రయాణిస్తుండగా దాని రెక్క భాగంలోకి ప్రవహించిన వేడి వాయువులు అది విరిగిపోయేలా చేశాయి. దీంతో నౌకలో ఒత్తిడి తగ్గి క్షణాల్లో కుప్పకూలింది. నౌకలో దెబ్బతిన్న భాగం తీవ్రతను శాస్త్రవ్తేతలు ముందుగానే పసిగట్టి ఉంటే ప్రమాదాన్ని ఊహించగలిగేవారు’ అని నాయర్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు