‘స్కార్పిన్’ రహస్యాలు లీక్

25 Aug, 2016 02:50 IST|Sakshi
‘స్కార్పిన్’ రహస్యాలు లీక్

- విచారణ జరపాల్సిందిగా నేవీ చీఫ్‌ను ఆదేశించిన రక్షణ మంత్రి
- జలాంతర్గాముల లీకేజీని బయట పెట్టిన ఆస్ట్రేలియా పత్రిక
- భారత నౌకాదళానికి ఎదురుదెబ్బ
 
 న్యూఢిల్లీ: భారత నౌకా దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ  డీసీఎన్‌ఎస్ సాంకేతిక సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న ఆరు అత్యాధునిక స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత సున్నిత సమాచారం లీక్ అయింది. దీంతో దేశ భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తక్షణం దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాల్సిందిగా రక్షణమంత్రి మనోహర్ పరీకర్ ఆదేశించారు. ఈ లీకేజీకి సంబంధించి 22,400 పేజీల సమాచారం వెల్లడయింది. స్కార్పిన్ జలాంతర్గాముల శక్తి సామర్థ్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉంది. ఈ జలాంతర్గాముల్లో సిబ్బంది ఏ పౌనఃపున్యం వద్ద నిఘా పెడతారు.

వివిధ వేగాల వద్ద, వివిధలోతుల్లో జలాంతర్గామి ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి శబ్దాలు వస్తాయి అనే విషయాలకు సంబంధించి సమస్త సమాచారం ఇందులో ఉందని అస్ట్రేలియాకు చెందిన ’ది ఆస్ట్రేలియన్’ పత్రిక వెల్లడించింది. స్కార్పిన్ సబ్‌మెరైన్‌లో ఉన్నవారు శత్రువులు గమనించకుండా వారిలో వారు మాట్లాడుకునే అవకాశం ఉందని వెల్లడైన పత్రాలను ఉటంకిస్తూ ది ఆస్ట్రేలియన్ పత్రిక తెలిపింది. అంతే కాకుండా సబ్‌మెరైన్‌కు  అయస్కాంత, విద్యుదయస్కాంత, ఇన్ఫ్రా రెడ్ తరంగాల సమాచారాన్ని, సబ్‌మెరైన్ టార్ఫిడో ప్రయోగ వ్యవస్థ, యుద్ధ వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ పత్రాల్లో ఉన్నట్లు పత్రిక తెలిపింది. జలాంతర్గామి వేగం, పెరిస్కోప్ వినియోగానికి అవసరమైన పరిస్థితులు, ప్రొఫెల్లర్ నుంచి వచ్చే శబ్ధం, ఉపరితలానికి చేరుకునేటప్పటి పరిస్థితులకు సంబంధించిన సమాచారమంతా ఈ పత్రాల్లో ఉంది.

మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిందిగా నేవీ చీఫ్‌ను ఆదేశించినట్లు రక్షణమంత్రి పరీకర్ విలేకర్లకు తెలిపారు. తనకు తెలిసినంతవరకు సమాచారం హ్యాకింగ్‌కు గురైందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. లీకేజీకి సంబధించిన సమాచారం భారత్‌నుంచి వెల్లడి కాలేదన్న విషయం వందశాతం చెప్పగలనని, కొద్ది రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడవుతాయని రక్షణమంత్రి తెలిపారు. స్కార్పిన్‌లకు సంబంధించిన సమాచారం లీక్ అయిన విషయం ఒక విదేశీ మీడియా వెల్లడించిందని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని రక్షణశాఖకు చెందిన నిపుణులు పరిశీలిస్తున్నారని నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ రహస్య పత్రాల లీకేజీ  వ్యవహారం ఆస్ట్రేలియా ప్రభుత్వంలోనూ గుబులు రేకెత్తిస్తోంది.
 
 భారత్ నుంచే లీకయ్యే అవకాశం: డీసీఎన్‌ఎస్
 లీకైన సమాచారం ఫ్రాన్స్ కంటే భారత్ నుంచే లీకయ్యే అవకాశం ఉందని నిర్మాణ కంపెనీ డీసీఎన్‌ఎస్ స్పష్టంచేసింది. భారత్‌లో డీసీఎన్‌ఎస్ డిజైన్‌తో స్థానిక కంపెనీ నిర్మాణం చేపడుతోందని, డీసీఎన్‌ఎస్ దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తుందే కాని దాన్ని నియంత్రించదని కంపెనీ తెలిపింది. పత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి  డెరైక్టర్ ఆఫ్ సొసైటీ ఆఫ్ పాలసీ స్టడీస్ రిటైర్డ్ కమాండర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, లీకైన డాక్యుమెంట్లు వాస్తవమైనవా కాదా అనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు