ఎలక్ట్రిక్ హైవేలు వస్తున్నాయ్!!

20 Aug, 2015 09:09 IST|Sakshi
ఎలక్ట్రిక్ హైవేలు వస్తున్నాయ్!!

సాక్షి: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి అందుబాటులోకి వస్తున్నాయి. అలా ఓ కొత్త ఆవిష్కరణ.. దాని వెనుక కొన్ని సవాళ్లు.. చివరకు వాటికి పరిష్కారం.. అలాంటి వాటిలో ఒకటి ఎలక్ట్రిక్ హైవేలు. కొన్నేళ్ల క్రితం ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటికి అంతగా ఆదరణ లభించలేదు. ఈ క్రమంలోనే వీటి వినియోగానికి ఇప్పుడు ఓ పరిష్కారమార్గాన్ని కనుగొన్నారు నిపుణులు. అదే ఎలక్ట్రిక్ హైవే.
 
ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డంకులు
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లువంటి వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటికి ఎక్కడా సరైన ఆదరణ లభించలేదు. ఇందుకు ఉన్న కారణాల్లో ప్రధానమైంది.. వీటితో ఎక్కువ దూరం ప్రయాణించలేం. గంట, లేదా రెండు గంటలపాటు చార్జింగ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవుతుంది. కానీ ఈ బ్యాటరీలతో 30, 40 కిలోమీటర్లకు మించి దూరం వెళ్లలేం. అందువల్ల ఎక్కువ దూరం ప్రయాణించేవారు ఇలాంటి వాహనాలు తీసుకోరు. పైగా వీటిని ఎక్కడపడితే అక్కడ చార్జ్ చేసుకోలేం. ప్రయాణం మధ్యలో చార్జింగ్ అయిపోతే ఇక అంతే సంగతులు. మళ్లీ చార్జింగ్ చేయగలిగే సెంటర్లు ఎక్కువగా అందుబాటులో లేవు.
 
పర్యావరణహితం
ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి మేలు కలిగిస్తాయి. సంప్రదాయ వాహనాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలను ఇంధనంగా వాడుతున్నారు. వీటిని వినియోగించడం వల్ల హానికర వాయువులు గాలిలోకి విడుదలవుతాయి. ఫలితంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. పైగా భవిష్యత్‌లో ఈ వనరుల కొరత వెంటాడే అవకాశం ఉంది. వీటి ధరలూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ముందుగా వీటి వినియోగంలో ఉన్న సమస్యలను అధిగమించాలి.

విదేశాల్లో అధికం..
మన దేశంలో కన్నా బ్రిటన్, అమెరికాలాంటి దేశాల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. బ్రిటన్‌లో ఇటీవల కాలంలో వీటి అమ్మకాలు 300 శాతం పెరిగినట్లు అంచనా. వీటిని మరింతగా వినియోగంలోకి తేవాలని ఆయా దేశాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా బ్రిటన్‌లో ఇప్పటికే పలు చోట్ల రహదారులపై ఎలక్ట్రిక్ చార్జింగ్ సెంటర్లను ప్రభుత్వం నెలకొల్పింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు.
 
ఎలక్ట్రిక్ హైవేలంటే..
రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు ఉన్నట్లుగానే హైవేలమీద ఎలక్ట్రిక్ హైవేలకోసం ఓ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రోడ్ల అంతర్భాగంలో ఎలక్ట్రిక్ కేబుల్స్‌ని ఏర్పాటు చేస్తారు. ఇవి విద్యుదయస్కాంత తరంగాల్ని ఏర్పరుస్తాయి. ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటే ఎలక్ట్రిక్ కార్లకు అడుగు భాగంలో ప్రత్యేక పరికరం ఉండాలి. ఈ రోడ్లపై వాహనాలు వెళ్తున్నప్పుడు వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఆ పరికరానికి విద్యుత్ శక్తిని అందిస్తాయి. ఈ పరికరం ద్వారా అది కారు బ్యాటరీకి చేరి చార్జింగ్ అవుతుంది.


దీంతో రోడ్లపై వెళ్తున్నంతసేపూ కార్లకు చార్జింగ్ అవుతూనే ఉంటుంది. ఎంతదూరం వెళ్లినా చార్జింగ్ అయిపోతుందనే ఇబ్బంది ఉండదు. చార్జింగ్ కోసం మధ్యలో ఎక్కడా ఆగాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. బ్రిటన్‌లో ఇలా రహదారిని ఏర్పాటు చేసి పరీక్షించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలో కూడా ఎలక్ట్రిక్ హైవేలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా పర్యావరణానికీ మేలు జరుగుతుంది.

మరిన్ని వార్తలు