ఉమ్మడి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌కు ఓకే!

8 Feb, 2016 01:36 IST|Sakshi

 చట్ట సవరణ ప్రతిపాదనకు నడ్డా ఆమోదం
 
 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష  నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం భారత వైద్యమండలి (ఎంసీఐ) చట్టాన్ని సవరించాలన్న ఎంసీఐ సిఫార్సుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. ఉమ్మడి పరీక్షపై వైద్య, ఆరోగ్య శాఖ ఓ కేబినెట్ నోట్ ఇతర మంత్రిత్వ శాఖలకు పంపింది.

విస్తృత సంప్రదింపుల తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష అన్ని కాలే జీల్లోని అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటు కాలేజీలు కూడా దీని పరిధిలోకి వస్తాయని తెలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో  ఏటా 32 వేల అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు, 13 వేల పోస్టుగ్రాడ్యుయేట్ సీట్ల భర్తీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం వైద్యవిద్యలో సీటు కోసం విద్యార్థులు ఏడుకుపైగా పరీక్షలు రాయాల్సి వస్తుండగా.. కొత్త విధానం అమల్లోకి వస్తే ఒక పరీక్ష రాస్తే సరిపోతుంది.

మరిన్ని వార్తలు