చీకట్లను చీల్చుకుంటూ....

15 Nov, 2018 20:21 IST|Sakshi
నింగిలోకి దూసుకెళ్తున్న జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 రాకెట్‌

దేశమంతా చీకట్లు కమ్ముకుంటున్న వేళ, నా సమయమైందే అని చంద్రుడు ఎదురొస్తున్న వేళ బంగారు వర్ణపు నిప్పులు కక్కుతూ జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తున్న వేళ తీసిన అపురూప సుందర చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. చంద్రుడికి అభిముఖంగా జీఎస్‌ఎల్వీ దూసుపోతున్న ఫొటోను చూసి కుంచెపై గీచిన చిత్రంలా అందంగా ఉందంటూ నెటిజన్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 రాకెట్‌ ద్వారా జీశాట్‌–29 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్‌–29లో కేఏ, కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లను అమర్చారు.

ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్‌ ప్రజల ఇంటర్నెట్‌ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ రాకెట్‌ 43.43 మీటర్ల పొడవుతో 640 టన్నుల బరువుంటుంది. జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–డీ2 రాకెట్‌ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారి ఆలయంలో రాకెట్‌ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి శివన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు