సరిహద్దు వద్ద రాకపోకలు బంద్‌

14 Mar, 2017 03:27 IST|Sakshi

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా పూంచ్‌లో నియంత్రణ రేఖ వద్ద రాకపోకలను అధికారులు సోమవారం తాత్కాలికంగా నిలిపివేశారు. పాకిస్తాన్‌ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంతో ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. పూంచ్‌–రావల్కోట్‌ బస్సు సర్వీసును నిలిపేశారు. పాక్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో నియంత్రణ రేఖ వద్ద ఉండే రెండంతస్తుల వ్యాపార నిర్వహణ కేంద్రం కూడా ధ్వంసమైంది. భారత్‌ నుంచి ఎటువంటి రెచ్చగొట్టే చర్యలూ లేకుండానే పాక్‌ కాల్పులు జరుపుతోందనీ, భారత దళాలు పాక్‌ కాల్పులకు గట్టిగా బదులిస్తున్నాయనీ, మన సైనికులంతా క్షేమంగానే ఉన్నారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని నమ్మాలనీ, పాక్‌కు తగిన బుద్ధి చెబుతామని ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. పాక్‌ దళాలు ఆదివారం కృష్ణగతి సెక్టార్‌లోనూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సోమవారం ఉదయం పూంచ్‌లో 6.40 గంటలకే మళ్లీ కాల్పులు మొదలు పెట్టారు. 24 గంటలైనా గడవక ముందే రెండోసారి పాక్‌ కాల్పులు జరిపింది. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయనీ, పాక్‌ దళాలు ఆగి ఆగి కాల్పులు జరుపుతున్నాయని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.

మరిన్ని వార్తలు