మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయింయిన లాయర్‌

28 May, 2020 17:36 IST|Sakshi

న్యూఢిల్లీ: నిన్నంతా సోషల్‌ మీడియాతో పాటు పలు న్యూస్‌ చానళ్లు, వెబ్‌సైట్లలో ఓ వార్త బాగా ప్రచారం అయ్యింది. సరైన ఆహారం, నీరు లేక ఓ మహిళా వలస కూలీ మృతి చెందింది. విషయం తెలియని ఆ అభాగ్యురాలి కుమారుడు తల్లి చీర పట్టుకుని ఆమెను లేపేందుకు ప్రయత్నం చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ నేపథ్యంలో దారుణానికి కారకులైన రైల్వే అధికారులు, బిహార్‌ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలంటూ ఓ లాయర్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. వివరాలు.. 

బదర్‌ మహ్మద్‌ అనే లాయర్‌ ‘రాజ్యాంగంలోని 21వ ప్రకరణ దేశంలోని ప్రతి ఒక్కరికి జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత గౌరవానికి హామీ ఇస్తుంది. అలానే ఆదేశ సూత్రాలు ప్రతి రాష్ట్రం తన పౌరులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి సంక్షేమానికి కృషి చేయాలని తెలుపుతున్నాయి. అయితే రైల్వే శాఖ, బిహార్‌ ప్రభుత్వాలు మాత్రం వీటిని పట్టించుకోలేదు. వలస కూలీలకు అవసరమైన ఆహారం, ఆరోగ్య సేవలు కల్పించడంలో విఫలమయ్యాయి. ఫలితంగా సదరు మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో మే 25 నాటి ముజఫర్పూర్‌‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ సీసీటీవీ ఫుటేజిని స్వాధీనం చేసుకుని ఈ దారుణానికి కారకులైన  రైల్వే శాఖ, బిహార్‌ ప్రభుత్వాల మీద తగిన చర్యలు తీసుకోవాలి. అంతేకాక మృతురాలి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందేలా చూడాలి’ అంటూ మానవ హక్కుల కమిషన్‌ను కోరాడుబదర్‌ మహ్మద్‌.(వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది)

మరిన్ని వార్తలు