టూ వీలర్ కొంటే హెల్మెట్ ఫ్రీ..!

31 Mar, 2016 16:23 IST|Sakshi
టూ వీలర్ కొంటే హెల్మెట్ ఫ్రీ..!

కేరళ:  ద్విచక్ర వాహనం నడిపేప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలన్న నిబంధన దాదాపు అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. రూల్స్ అధిగమించేవారికి, నిర్లక్ష్యంగా వ్యవహరించినవారికి జరిమానాలు విధించడం, ఆర్టీఏ వెబ్ సైట్లో చలాన్లు పంపించడం చేస్తున్నారు. దీంతో ఇంతకు ముందు హెల్మెట్ లేని వారు కూడా ఇప్పుడు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్న కేరళ రవాణా, రోడ్ సేఫ్టీ కమిషనర్ టామిన్ జె థచంకరీ నూతన దిశా నిర్దేశాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ ను బహూకరించేందుకు కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దీంతోపాటు వాహనానికి కావలసిన నెంబర్ ప్లేట్, అద్దాలు, శారీ  గార్డ్, వంటి  కొన్ని ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు.  కేరళలోని సుమారు 50 మోటార్ సైకిల్ తయారీదారులతో  సమావేశం నిర్వహించిన అనంతరం మార్చి 29న ఈ నూతన నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.  ఉపకరణాలకు కొనుగోలుదారుల వద్ద ఎటువంటి డబ్బు వసూలు చేయకూడదని  సమావేశంలో నిర్ణయించారు.

అయితే ఇలా హెల్మెట్ ఉచితంగా పంపిణీ చేసిన తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించటంతో పాటు,  లైసెన్సులను సైతం రద్దు చేసేందుకు కేరళ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం కేరళలో గతేడాది 20,000 లకు పైగా ప్రమాదాలు చోటు చేసుకోవడం, ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుంది.

మరిన్ని వార్తలు