‘సీఎం మోసం చేశారు.. రాజీనామా చేస్తున్నా’

2 Oct, 2018 10:48 IST|Sakshi
కంప్యూటర్‌ బాబా అలియాస్‌ నామ్‌దేవ్‌ త్యాగి (ఫైల్‌ ఫోటో)

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు స్వామి నామ్‌దేవ్‌ త్యాగి ఝలక్‌ ఇచ్చారు. పట్టుమని ఆరునెలలు కూడా గడవక ముందే సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్లే తాను రాజీనామ చేస్తున్నట్లు ‘కంప్యూటర్‌ బాబా’గా ప్రసిద్ధికెక్కిన నామ్‌దేవ్‌ త్యాగి ప్రకటించారు. నర్మదా నది పరిరక్షణ హామీలను నిలబెట్టుకోవడంలో చౌహాన్‌ సర్కారు విఫలమైం‍దని విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నన్ను మోసం చేశారు. నర్మాద నదిలో అక్రమ మైనింగ్‌ని అడ్డుకుంటానని ఆయన హమీ ఇచ్చారు. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఫలితంగా నేను చేసిన వాగ్దానాలను కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో నా అనుచరులకు ఏమని చెప్పాలి.. వారికి నా మొహం ఎలా చూపించాలి’ అని ప్రశ్నించారు.

అంతేకాక తాను ఇచ్చిన ఏ ఒక్క హమీని నిలబెట్టుకోలేకపోయానని.. అందువల్లే తన పనితీరు గురించి ప్రజలు వందకు సున్నా మార్కులు ఇచ్చారని వాపోయారు. దాంతో పదవిని వదులుకోవాలని నిర్ణయంచినట్టు వెల్లడించారు. దీనంతటికి కారణం సీఎం చౌహన్‌ అని ఆరోపించారు. అంతేకాక నర్మదా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్‌ గురించి ప్రజలకు తెలియజేయడం కోసం ఒక యాత్రను చేపట్టనున్నట్లు కంప్యూటర్‌ బాబా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఐదుగురు స్వామిజీలకు సహాయ మంత్రి హోదా కల్పించింది. వారిలో కంప్యూటర్‌ బాబా ఒకరు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు