తీరని ఆవేదనతో..

23 Apr, 2015 02:33 IST|Sakshi
తీరని ఆవేదనతో..

రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో నంగల్ ఝామర్వాడా గ్రామానికి చెందిన గజేంద్రసింగ్.. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని సూసైడ్ నోట్‌లో రాసిపెట్టాడు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తమ పంట మొత్తం దెబ్బతిన్నదని, దాంతో తన తండ్రి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇక భవిష్యత్తు అంటూ ఏమీ లేదని, తాను జీవించి ఉండి లాభమేమీ లేదని ఆక్రోశం వెలిబుచ్చాడు. తాను మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు తెలియజేయాలంటూ వారి ఫోన్ నంబర్లను కూడా రాసిపెట్టాడు. కింద జైజవాన్, జైకిసాన్, జై రాజస్థాన్ అని రాశాడు.

పంట నష్టంతో ఒత్తిడికి లోనై..: పంట నష్టంతో రైతు గజేంద్ర తీవ్ర ఒత్తిడికి, ఆవేదనకు లోనయ్యాడని ఆ రైతు బంధువు గోపాల్‌సింగ్ తెలిపారు. దౌసా జిల్లాధికారులు మాత్రం దాన్ని ఖండించారు. గజేంద్ర కుటుంబం ఆర్థికంగా బాగుందని, వారికి ఫాం హౌజ్ కూడా ఉందని, గజేంద్ర మామ ఆ గ్రామ సర్పంచ్ అని దౌసా జిల్లా అదనపు కలెక్టర్ కైలాశ్ శర్మ వివరించారు. ఆ ప్రాంతంలో పంట నష్టం కూడా తీవ్రంగా లేదని, పరిహారానికి అర్హత లభించే 33% పంటనష్టం అక్కడ ఎవరికీ జరగలేదని తెలిపారు. పరిహారం కోరుతూ గజేంద్ర ఎన్నడూ అధికారుల వద్దకు రాలేదని మరో అధికారి దయానంద్ వెల్లడించారు.
 
 

మరిన్ని వార్తలు