కాంగ్రెస్ ఎమ్మెల్యేకి 'సెల్ఫీ' చిక్కు...

22 Sep, 2016 20:57 IST|Sakshi
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి 'సెల్ఫీ' చిక్కు...

పాట్నాః బీహార్ బస్సు ప్రమాద ప్రాంతంలో సెల్ఫీ తీసుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భావనా ఝా చిక్కుల్లో పడింది. మధుబని ప్రాంతంలో బస్సు చెరువులో పడి 27 మంది వరకూ ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో ఆమె స్థానికులతో తీసుకున్న సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మధుబని జిల్లాలోని బెనిపట్టి ఎమ్మెల్యే.. స్థానికులతో కలసి తీసుకున్న సెల్ఫీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ఆమె పీకకు చుట్టుకుంది. ఎమ్మెల్యే ఫోటోను బీజేపీ తీవ్రంగా తప్పు పడుతోంది. అదో అనైతిక చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 9న ప్రయాణీకులతో వెడుతున్న బస్సు బసైతా చౌక్ ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో పడిపోగా 27 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అటువంటి బీభత్సం జరిగిన ప్రాంతంలో ఎమ్యెల్యే ఫోటోలకు పోజులివ్వడం విచారకరమని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి బినోద్ నారాయణ్ ఝా ఆరోపించారు.  మానవ విషాదం జరిగిన సమయాన్ని కూడా ఎమ్మెల్యే  పిక్నిక్ స్పాట్ లా ఫీలై రాజకీయానికి వాడుకుంటున్నారంటూ విమర్శించారు. మరోవైపు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ప్రేమ్ కుమార్.. బీహార్ ప్రజలకు భావనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే బీజేపీ రాజకీయ లబ్ధికోసమే వివాదం సృష్టిస్తోందని భావన అంటున్నారు. ప్రమాద ఘటనలో రెస్క్యూ నిర్వహిస్తున్న స్థానికులు.. తనతో ఫోటో దిగుతామని కోరారని భావనా ఝా చెప్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్విహించిన యువకులు సెల్ఫీ తీసుకుంటామన్నారని.. వారి కోరికను మన్నించి వారితో ఫోటో తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే పార్టీ సహచరుడు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి మదన్ మోహన్ ఝా ఆమెకు మద్దతునిచ్చారు. బస్సు ప్రమాదం తర్వాత ప్రజలకు గొప్ప సేవలను అందించిన భావనను ప్రశంసించాల్సింది పోయి... ఫోటోలను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు