కాంగ్రెస్, బీజేపీయేతర వేదిక!

7 Oct, 2013 02:17 IST|Sakshi
కాంగ్రెస్, బీజేపీయేతర వేదిక!

 న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఒకే ఉమ్మడి వేదికపైకి తెచ్చేందుకు సీపీఎం కసరత్తు ప్రారంభించింది. ఆదివారం ఇక్కడ ప్రారంభమైన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాలలో దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశాలు రెండురోజుల పాటు జరుగుతాయి.  ఐదురాష్ట్రాల ఎన్నికలతో పాటు త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.  ప్రజా సమస్యలపై సమైక్యంగా పోరాటాలు జరపడం కోసం ఓ విశాల వేదికను ఏర్పాటు చేయడం... అదే వేదికను తదనంతర కాలంలో ఎన్నికల్లోనూ ప్రయోగించడం లక్ష్యంగా సీపీఎం ఓ జాతీయ సదస్సును కూడా నిర్వహిస్తోంది. లౌకిక వాదానికి మద్దతుగా ఈ నెల 30న జరిగే ఈ సదస్సులో వామపక్ష అగ్రనేతలతో పాటు ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ తదితరులు పాల్గొనే అవకాశం ఉందని సీపీఎం వర్గా లు వెల్లడించాయి.
 
  ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలపైన కూడా పొలిట్‌బ్యూరో చ ర్చిస్తోంది. ఈ నెలలో తాను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌ను కలుస్తానని, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తానని ములాయం ఇప్పటికే ప్రకటిం చారు. ప్రత్యామ్నాయ విధాన ప్రాతిపదిక ఆధారంగా లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నిటినీ ఏకం చేయడమే లక్ష్యంగా సీపీఎం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ నయా ఉదారవాద విధానాలను తూర్పారబడుతూ, మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మతతత్వ పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తోంది. పార్టీ అగ్ర నేతలు కారత్, సీతారాం ఏచూరీలు ఎస్పీ, జేడీ(యూ)ల అధినేతలతో పాటు ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితతో కూడా చర్చలు కొనసాగిస్తున్న సంగతి తెల్సిందే

మరిన్ని వార్తలు