16 కోట్ల ఏజేఎల్‌ భవనం అటాచ్‌

10 May, 2020 04:42 IST|Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతీలాల్‌ వోరాకు ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌)కు చెందిన రూ.16.38 కోట్ల విలువైన భవనాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఏజేఎల్‌తోపాటు, ఆ సంస్థ సీఎండీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతీలాల్‌ వోరాకు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ఏరియాలోని తొమ్మిదంతస్తుల భవనంలోని కొంత భాగాన్ని అటాచ్‌ చేసినట్లు శనివారం ఈడీ తెలిపింది.

గాంధీ కుటుంబసభ్యులతోపాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల ఆధ్వర్యంలోని ఏజేఎల్‌ గ్రూపు ఆ పార్టీకి చెందిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను నిర్వహిస్తోంది.1992లో హరియాణా సీఎంగా ఉన్నపుడు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపీందర్‌ హూడా పంచ్‌కులలోని భూమిని తక్కువ ధరకే ఏజేఎల్‌కు కేటాయించి, అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఆ భూమి వాస్తవ విలువ రూ.64.93 కోట్లు కాగా కేవలం రూ.59.39 లక్షలకే ఏజేఎల్‌కు అప్పగించారంటూ ఈడీ ఇప్పటికే ఆ భూమిని అటాచ్‌ చేసింది. ఈ కేసులో హూడా, వోరాలను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి 2018లో మోతీలాల్‌ వోరా, భూపీందర్‌ హూడాపై పంచ్‌కుల కోర్టులో చార్జిషీటు వేసింది.

మరిన్ని వార్తలు