నాడే కాంగ్రెస్‌ను  వద్దనుకున్నగాంధీ 

13 Mar, 2019 02:39 IST|Sakshi

దండి వార్షికోత్సవ వేళ మోదీ 

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సంస్కృతిని బాగా అర్థం చేసుకున్న జాతిపిత గాంధీ 1947 తరువాత ఆ పార్టీ రద్దుకావాలని కోరుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్‌ పనితీరు గాంధీ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా ఉందని ఆరోపించారు. అసమానత్వం, విభజనలను గాంధీ అసలు పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్‌ సమాజాన్ని విభజించేందుకు ఎప్పుడూ సంకోచించలేదని దుయ్యబట్టారు. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం గాంధీ చూపిన బాటలోనే నడుస్తోందని అన్నారు. దండి ఉప్పు సత్యాగ్రహానికి 89 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం మోదీ ప్రత్యేక బ్లాగ్‌ రాస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.  

అల్లర్లు, ఎమర్జెన్సీ వాళ్ల చలవే.. 
‘నిరుపేదల దయనీయ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉండాలని గాంధీ బోధించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అలాంటి వ్యక్తులపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో మేము పరిశీలించాం. పేదరిక తగ్గింపు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మా ప్రభుత్వం పనిచేసిందని గర్వంగా చెబుతున్నా. దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌ సంస్కృతి మహాత్ముడి ఆదర్శాలకు భిన్నంగా తయారైంది. అత్యంత హేయమైన కుల, దళిత వ్యతిరేక అల్లర్లు, అత్యవసర పరిస్థితి లాంటివి కాంగ్రెస్‌ హయాంలోనే చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, అవినీతి పరస్పరం పర్యాయ పదాలుగా మారాయి. రక్షణ, టెలికాం, సాగునీరు, క్రీడలు..ఇలా ఏ రంగం తీసుకున్నా కాంగ్రెస్‌ మార్కు స్కామ్‌ కనిపిస్తుంది’ అని మోదీ అన్నారు. 

మరిన్ని వార్తలు