యూపీఏ పక్షాలతో చర్చించాక సర్కారు నిర్ణయం

12 Jul, 2013 05:25 IST|Sakshi
యూపీఏ పక్షాలతో చర్చించాక సర్కారు నిర్ణయం

- పీటీఐ ఇంటర్వ్యూలో దిగ్విజయ్ వ్యాఖ్యలు
- సమైక్యం, తెలంగాణ రెంటిపైనా చర్చ
- 2014 ఎన్నికల కోసమే రోడ్‌మ్యాప్!
- కిరణ్, దామోదర, బొత్సలను కోరిందదే
- కోర్ భేటీలో వారు ప్రజెంటేషన్ ఇస్తారు
- దాని ఆధారంగా నిర్ణయం ఉంటుంది
- రాజ్యాంగ సవరణ అవసరం కావచ్చు
- మిత్రులు, విపక్షాలతోనూ చర్చించాలి
- తెలంగాణ నేతలతో ‘తీపి కబురు’ అనలేదు
- స్పష్టమైన నిర్ణయం ఉంటుందన్నానంతే

రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం... ఈ రెండు అవకాశాలనూ ‘ఓపెన్’గా ఉంచుకుంటూ కోర్ కమిటీ భేటీ చర్చిస్తుంది. రెండింట్లోనూ లాభనష్టాలు రెండూ ఉన్నాయి కాబట్టి దానిపై అంతిమంగా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అందుకోసం యూపీఏ మిత్రపక్షాలతోనూ చర్చించాలి. రాజ్యాంగ సవరణ అవసరం పడవచ్చు కాబట్టి విపక్ష పార్టీలనూ విశ్వాసంలోకి తీసుకోవాల్సి రావచ్చు.

న్యూఢిల్లీ: తెలంగాణపై కీలకమైన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీకి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాటి కోర్ భేటీలో రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమన్న రెండు అవకాశాలనూ ‘ఓపెన్’గా ఉంచుకుని చర్చిస్తామని ప్రకటించారు! ‘‘రెండింట్లోనూ లాభనష్టాలున్నాయి. కాబట్టి అంతిమంగా దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. విభజన దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తెలంగాణపై నిర్ణయాన్ని ఇంకెంతమాత్రమూ వాయిదా వేయలేమని గురువారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ పునరుద్ఘాటించారు.

అయితే... రాష్ట్ర ఏర్పాటుకే కాంగ్రెస్ నిర్ణయించుకుందా అని ప్రశ్నించగా, దానిపై నేనేమీ చెప్పలేనని ఆయన బదులిచ్చారు. ‘‘యూపీఏ మిత్రపక్షాలతో చర్చించిన మీదట కేంద్ర ప్రభుత్వమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ చేయాల్సి రావచ్చు. కాబట్టి దీనిపై విపక్ష పార్టీలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాల్సి రావచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకు త్వరలోనే తీపి కబురు ఉంటుందంటూ దిగ్విజయ్ హామీ ఇచ్చారన్న వార్తలను ప్రస్తావించగా, తాను ‘ఎలాంటి అయోమయానికీ తావు లేని నిర్ణయం ఉంటుంది’ అని మాత్రమే మాటిచ్చానన్నారు. అంతేగాదు... రాష్ట్ర విభజనపై రెండు పరిష్కార మార్గాలనూ ఓపెన్‌గా ఉంచుకుంటూ, 2014 సాధారణ ఎన్నికలపై దృష్టితో రోడ్‌మ్యాప్‌ను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులను కోరినట్టు దిగ్విజయ్ చెప్పారు! ‘‘కోర్ కమిటీ ముందు శుక్రవారం వారు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దాని ఆధారంగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది’’ అని పేర్కొన్నారు. తెలంగాణపై సోనియాగాంధీకి తాను సమర్పించిన నివేదికలోని అంశాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. రాయల తెలంగాణ అంశం పరిశీలనలో ఉందా అన్న ప్రశ్నకు బదులివ్వలేదు. తెలంగాణపై కాంగ్రెస్ చేసిన వాగ్దానాన్ని గుర్తుచేయగా, రెండో ఎస్సార్సీ వేస్తామంటూ 2004 ఎన్నికల మేనిఫెస్టోలో తామిచ్చిన వాగ్దానానికి 2009తో కాలం చెల్లిపోయిందన్నారు.

అయితే, ‘పలుమార్లు పలువురు నేతలు హామీ ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది’ అంటూ కీలక వ్యాఖ్య కూడా చేశారు. బహుశా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ 2009 డిసెంబర్ 9న అప్పటి హోం మంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకుని దిగ్విజయ్ ఇలా మాట్లాడారన్న భావన వ్యక్తమవుతోంది. కాగా తెలంగాణ ఇచ్చినా ఆ ఘనత టీఆర్‌ఎస్‌కు పోతుందని కాంగ్రెస్ భయపడుతోందా అని ప్రశ్నించగా, తాము అలాంటి ప్రాతిపదికలపై పని చేయమని దిగ్విజయ్ బదులిచ్చారు. ‘‘దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏది మంచిదన్నదే మాకు ప్రాతిపదిక. దాని ఆధారంగానే పని చేస్తాం’’ అన్నారు.

>
మరిన్ని వార్తలు