‘బొగ్గు’ ఫైళ్ల మాయంపై కాంగ్రెస్ కోర్ గ్రూప్ భేటీ

22 Aug, 2013 05:47 IST|Sakshi

న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల ఫైళ్లు మాయం కావడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన ప్రతివ్యూహంపై బుధవారం కాంగ్రెస్ అగ్రనాయకత్వం చర్చించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్, బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్‌తోకూడిన కోర్ గ్రూప్ ఈ మేరకు విస్తృతంగా చర్చలు జరిపింది. మాయమైన ఫైళ్లలో చాలా ఫైళ్లు దొరికాయని, కేవలం ఎనిమిది ఫైళ్లు మాత్రమే లేవని సమావేశంలో జైస్వాల్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
 బొగ్గు కేటాయింపులకు సంబంధించిన కేసులో దర్యాప్తు ప్రారంభించగానే సీబీఐకి 769 ఫైళ్లు, ఇతర పత్రాలు, దరఖాస్తులను బొగ్గు మంత్రిత్వ శాఖ అప్పగించిందని జైస్వాల్ సమావేశంలో తెలిపారు. అయితే ఆగస్టు 14న మరిన్ని ఫైళ్లు కావాలని సీబీఐ అడగడంతో 43 ఫైళ్లు, 176 దరఖాస్తులు లేవని గుర్తించారు. ఈ 43 ఫైళ్లలో ఇప్పటికే దొరికిన 21 ఫైళ్లను సీబీఐకి ఇచ్చారని, ఇంకో 14 ఫైళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, మరో 8 ఫైళ్లు మాత్రం ఎక్కడున్నాయో తెలియడం లేదని ఆ వర్గాలు తెలిపాయి. 176 దరఖాస్తుల్లో చాలావరకూ తిరస్కరించినవే ఉన్నాయని, మూడు మాత్రమే దొరకగా వాటిని సీబీఐకి ఇచ్చినట్లు చెప్పాయి. అయితే ఈ దరఖాస్తుల వివరాలన్నీ బొగ్గు బ్లాకులపై నిర్ణయం తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ మినిట్స్‌లో ఉంటాయని సమాచారం. అలాగే, పార్లమెంటు సమావేశాల్లో అంతరాయాల వల్ల ఆహారభద్రత బిల్లు ఆమోదానికి ఇబ్బందులు ఎదురవుతున్నందున తాజా ఆర్డినెన్స్ జారీచేయడంపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
 
 కోల్‌గేట్ పత్రాలు సీబీఐ వద్ద ఉన్నాయి: బొగ్గు మంత్రిత్వ శాఖ
 మాయమైన బొగ్గు కేటాయింపుల ఫైళ్లు సీబీఐ వద్ద ఉన్నాయని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తులకు బొగ్గు మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. బొగ్గు కేటాయింపులకు కంపెనీలు చేసుకున్న దరఖాస్తుల ప్రతులు ఇవ్వాలంటూ ‘ఎన్‌జీవో గ్రీన్‌పీస్’, ఇతర కార్యకర్తలు ఆర్టీఐ కింద కోరగా అవన్నీ సీబీఐ వద్ద ఉన్నాయని కేంద్రం ఈ మేరకు జవాబిచ్చింది.

మరిన్ని వార్తలు