41 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌యేతర డిప్యూటీ చైర్మన్‌..!

29 Mar, 2018 11:31 IST|Sakshi
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌

సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఎగువసభ డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ ఈ ఏడాది జులైలో రిటైర్‌ కానున్నారు. దీంతో 41 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవిని కాంగ్రెస్‌ కోల్పోయే అవకాశం ఏర్పడింది. 1977 నుంచి కాంగ్రెస్‌ పార్టీ నామినేట్‌ చేసిన వ్యక్తులే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. 1977లో కాంగ్రెస్‌ నాయకుడు రామ్‌ నివాస్‌ మిర్ధా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

కాంగ్రెస్‌ చేతుల్లో నుంచి ఇప్పటికే స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ పదవులు పోయాయని, భవిష్యత్‌లో ఓ నాన్‌ కాంగ్రెస్‌ ఎంపీనే ఎగువ సభ డిప్యూటీ చైర్మన్‌ అవుతారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ నాయకులు ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, కురియన్‌ తర్వాత డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయేకు చెందిన వ్యక్తిని కూర్చుబెట్టడం అంత సులువేమీ కాదు. అందుకు సరిపడా నంబర్‌ ఎన్డీయే వద్ద లేదు.

సంపద్రాయబద్దంగా అయితే లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ పదవులను అధికార పక్షానికి చెందిన వ్యక్తులు, డిప్యూటీ స్పీకర్‌, డిప్యూటీ చైర్మన్‌ పదవులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తుల నిర్వహిస్తారు. అయితే, రెండు పదవులను తమ వద్దే ఉంచుకునేందుకు అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించింది. దీంతో ఎన్డీయే కూడా అలానే చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్‌, బీజేపీ యేతర వ్యక్తికే డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు