ట్రైలర్‌తోనే రేగిన దుమారం

28 Dec, 2018 10:19 IST|Sakshi

సాక్షి, ముంబై : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై రూపొందుతున్న ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ మూవీ వివాదాస్పదమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం విడుదల కావడంతో సినిమా విడుదలకు ముందు తమకు ప్రదర్శించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌ టైటిల్‌ పాత్రను పోషించిన ఈ సినిమాపై మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు ముందు తమకు ప్రీ రిలీజ్‌ షో వేయాలని, లేకుంటే చిత్ర ప్రదర్శనను అడ్డుకునేందుకు ఇతర ప్రత్యామ్నాయాలవైపు మళ్లుతామని హెచ్చరించింది.

ఈ సినిమాలో వాస్తవాలు వక్రీకరించి రూపొందించిన సన్నివేశాలున్నాయని కాంగ్రెస్‌ పార్టీ మహారాష్ట్ర యూత్‌ విభాగం చిత్ర రూపకర్తలకు రాసిన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్రంలో ఎలాంటి అవాస్తవ సన్నివేశాలు చొప్పించలేదని వెల్లడించేందుకు తమకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.

ట్రైలర్‌ను పరిశీలిస్తే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీలకు సంబంధించి దుష్ప్రచారం చేసేలా సినిమా ఉంటుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయని, ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. తమ కార్యవర్గ సభ్యులకు ముందస్తుగా సినిమాను ప్రదర్శించి, తాము సూచించే మార్పులను చేపట్టకుంటే దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు తాము ఇతర మార్గాలను అనుసరిస్తామని ఆ ప్రకటనలో యూత్‌ కాంగ్రెస్‌ చిత్రబృందాన్ని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు