సీజేఐ అభిశంసనపై కాంగ్రెస్‌లో విభేదాలు..?

20 Apr, 2018 16:20 IST|Sakshi
సీనియర్ కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అభిశంసనపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్‌ మిశ్రా అభిశంసన కోరుతూ శుక్రవారం ఉపరాష్ట్రపతికి సమర్పించిన  విపక్ష ఎంపీల సంతకాలతో కూడిన నోటీసులో తాను సంతకం చేయలేదని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మం‍త్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చేసిన ప్రకటన ఇవే సంకేతాలను పంపుతోంది. సీజేఐ అభిశంసనను కోరుతూ ఏడు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు ఉపరాష్ట్రపతికి నోటీసులు ఇచ్చారు.

సీబీఐ జడ్జి జస్టిస్‌ బీహెచ్‌ లోయా మృతిపై విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో విపక్షాలు మిశ్రా అభిశంసనకు నోటీసు ఇవ్వడం గమనార్హం. తీర్పును కొందరు సమ్మతించడం లేదనే కారణంతో అభిశంసన చేపట్టడం తీవ్రమైన చర్యగా సల్మాన్‌ ఖుర్షీద్‌ స్పష్టం చేశారు. తాను ఈ నోటీసుపై సంతకం చేయలేదని ఆయన చెప్పారు. సంక్లిష్ట అంశాలను ఎదుర్కోవడంలో సుప్రీం కోర్టు సర్వసన్నద్ధంగా ఉందని సల్మాన్‌ ఖుర్షీద్‌ పేర్కొన్నారు.

జస్టిస్‌ లోయా కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అంగీకరించాలని, దాన్ని గౌరవించాలని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సైతం ఈ నోటీసుపై సంతకం చేయలేదు. కాంగ్రెస్‌ పార్టీ సహా ఏడు విపక్ష పార్టీలు ఈ నోటీసుపై సంతకాలు చేశాయని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు