చెదిరిన రంగసామి కల

19 May, 2016 15:57 IST|Sakshi
చెదిరిన రంగసామి కల

పుదుచ్చేరి సీఎం ఎన్.రంగసామి కల చెదిరింది. రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన ఆయనకు ఆశాభంగం ఎదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన రంగసామికి పుదుచ్చేరి ఓటర్లు షాక్ ఇచ్చారు. తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) రెండో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

30 స్థానాల్లో కాంగ్రెస్ 15, ఏఐఎన్‌ఆర్‌సీ 8, అన్నాడీఎంకే 4, డీఎంకే 2 సీట్లు గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగానే కాంగ్రెస్, ఏఐఎన్‌ఆర్‌సీ హోరాహోరీగా తలపడినట్టు పరిస్థితి కనిపించింది. చివరికి కాంగ్రెస్-డీఎంకే కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నాయి. అధికార ఏఐఎన్‌ఆర్‌సీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఒంటరిగా పోటీ చేసిన అన్నా డీఎంకే 4 స్థానాలు దక్కించుకుంది. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఆర్‌ఎస్‌పీలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీఎఫ్‌డబ్ల్యూ) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది.

ఇందిరా నగర్ నుంచి పోటీ చేసిన సీఎం రంగసామి 3,404 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఆరోసారి విజయం సాధించారు. అంతకుముందు 1996 నుంచి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 1996, 2001 సంవత్సరాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

మరిన్ని వార్తలు