ఢిల్లీకి రండి మాట్లాడుదాం !

1 Mar, 2016 10:26 IST|Sakshi
ఢిల్లీకి రండి మాట్లాడుదాం !
 సీఎం సిద్ధుకు అధిష్టానం పిలుపు
 మెడకు చుట్టుకుంటున్న‘గిఫ్ట్ వాచ్’ వ్యవహారం
 
సాక్షి,బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలవనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమచారం. నిడారంబరంగా జీవిస్తానని చెప్పుకునే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.70 లక్షల విలువ చేసే వాచ్ ఎలా వాడుతున్నారంటూ జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఘాటుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విషయం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ  ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని సూటు బూటు ప్రభుత్వం అంటూ విమర్శలకు దిగిన నేపథ్యంలో తమ పార్టీకు చెందిన ఓ ముఖ్యమంత్రి విలువైన వస్తువులు ధరించడం కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు.
 
దీంతో సీఎం సిద్ధరామయ్యపై హైకమాండ్ గుర్రుగా ఉంది. ఇదిలా ఉండగా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత సీఎం సిద్ధు స్వయంగా ఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు ‘మేడం’ సోనియాగాంధీతో భేటీ అయ్యి ‘ఆ వాచ్ నాకు ఓ స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఈ విషయంలో అనవసర అరోపణలు చేశారు.’ అని వివరణ ఇచ్చారు. అయితే ఈ సీఎం సిద్ధు వివరణపై పార్టీ పెద్దలు సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో ఈ వాచ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను మేడం సోనియాగాంధీతో పాటు యువరాజు రాహుల్‌గాంధీలు తెప్పించుకునే పనిలోపడ్డారు.
 
ఈ విషయమై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) నాయకులు కొంతమంది ఇప్పటికే నివేదిక తయారు చేసే పనిలోపడ్డారు. ఇదిలా ఉండగా సిద్ధరామయ్య ధరిస్తున్న వాచ్ దొంగతనానికి గురైనదని కుమారస్వామి రెండు రోజుల ముందు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ వాచ్ యజమానిగా భావిస్తున్న రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్‌శెట్టిని నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ సోమవారం స్వయంగా విచారణ చేశారు. విచారణ అనంతరం సుధాకర్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ...‘ఆ వాచ్ నాది కాదు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాను.’ అని పేర్కొన్నారు. 
 
మరిన్ని వార్తలు