‘మోదీ విధానాలతోనే ఆర్థిక మందగమనం’

12 Sep, 2019 18:22 IST|Sakshi

న్యూఢిల్లీ : మోదీ సర్కార్‌ అసమర్ధ విధానాలతోనే ఆర్థిక మందగమనం నెలకొందని దీనిపై అక్టోబర్‌లో దేశవ్యాప్త ఆందోళన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఆర్థిక మందగమనానికి దారితీసిన మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అక్టోబర్‌ 15 నుంచి 25 వరకూ దేశవ్యాప్తంగా భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. ఇదే అంశంపై ఈనెల 28-30 వరకూ రాష్ట్రస్ధాయి పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిదని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనానికి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. యూపీఏ హయాంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తగా అప్పట్లో తాము చేపట్టిన చర్యలను, సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొన్న తీరును ప్రజలకు వివరించాలని మన్మోహన్‌ సింగ్‌ కాంగ్రెస్‌ శ్రేణులను కోరారు. ఇక మోదీ ప్రభుత్వ విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైందని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు