‘వాక్‌ స్వాతంత్ర్యం గురించి కాంగ్రెస్సా మాట్లాడేది’

27 Feb, 2017 19:30 IST|Sakshi
‘వాక్‌ స్వాతంత్ర్యం గురించి కాంగ్రెస్సా మాట్లాడేది’

న్యూఢిల్లీ: వాక్‌ స్వాతంత్ర్యం అంటే నేరాలకు పాల్పడే హక్కు కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలే తప్ప అశాంతిని పురికొల్పేలాగా మాట్లాడకూడదనిహితవు పలికారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్‌ కాలేజీ గత నాలుగు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖలిద్‌ను రాంజాస్‌ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది.

దేశద్రోహులను ఇలాంటి కార్యక్రమాలకు రానివ్వొద్దంటూ ఏబీవీపీ ఆందోళన లేవనెత్తడంతో అది కాస్త రెండు గ్రూపుల పంచాయితీగా మారింది. అయితే, కొంతమంది విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారని, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలు ఈ గొడవలోకి బీజేపీని లాగాయి. కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందించారు.

‘భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను గౌరవించకుండా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన కాంగ్రెస్‌ పార్టీ నేడు వాక్‌ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతోంది. వాక్‌ స్వాతంత్ర్యం రాజ్యాంగం ప్రసాధించింది. సమాజంలో అశాంతి యుత పరిస్థితులు ఏర్పడకుండా, ఎవరి మనోభావాలు కించపరచకుండా ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి. భారత దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఎవరు కూడా ప్రత్యేకవాదాన్ని ప్రోత్సహించరు’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

మరిన్ని వార్తలు