‘ఇక మన ఎకానమీని దేవుడే కాపాడాలి’

3 Dec, 2019 12:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భవిష్యత్‌లో జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు సంకేతం కాబోవని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్థిక విధానాలు చూస్తుంటే ఇక మన ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. దిగుమతి సుంకాల పెంపు, వ్యక్తిగత పన్నుల్లో కోత వంటి ప్రభుత్వ చర్యలు ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి దారితీస్తాయని ట్వీట్‌ చేశారు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తిహార్‌ జైలులో ఉన్న చిదంబరం గత కొంత కాలంగా మోదీ సర్కార్‌ ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో జీడీపీ 4.5 శాతానికి పరిమితం కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాలం చెల్లిన పద్ధతిలో జీడీపీని మదింపు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు జీడీపీ ప్రామాణికం కాదని బీజేపీ ఎంపీ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దూబే వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇలాంటి ఆర్థిక వేత్తల నుంచి నవభారతాన్ని భగవంతుడే కాపాడాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జీవాలా ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు