‘సీతాదేవి అందుకు పూర్తి అర్హురాలు’

14 Dec, 2018 12:06 IST|Sakshi

లక్నో : అఖండ భారతావనిని ఏకం చేసిన సర్ధార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఐక్యతా విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తమ రాష్ట్రంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దాదాపు 221 మీటర్ల ఎత్తు ఉండే రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యోగి తెలిపారు. రాముడి విగ్రహంతో పాటు సీతా దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ యోగికి లేఖ రాశారు యూపీ కాంగ్రెస్‌ నాయకుడు కరణ్‌ సింగ్‌.

‘మీరు రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నా అభ్యర్థన ఏంటంటే రాముడి విగ్రహం ఎత్తును తగ్గించడమే కాక శ్రీరామునితో పాటు సీతాదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయండి. రామున్ని పెళ్లి చేసుకున్న తర్వాత సీతా దేవి అయోధ్య వచ్చారు.. కానీ కొద్ది రోజుల్లోనే శ్రీరామునితో కలిసి వనవాసం చేయడానికి అడవులకు వెళ్లారు. 14 ఏళ్లు అరణ్యవాసంలో ఉన్నారు. చివరకు రావణాసురుడు అమ్మను ఎత్తుకెళ్లాడు. ఆ రాక్షసుడి చెర నుంచి రాముడు సీతాదేవిని విడిపించాడు. కానీ అగ్ని పరీక్షలో నెగ్గినప్పటికి.. చివరకూ ఆ తల్లి మళ్లీ అడవుల పాలయ్యారు. అది గర్భవతిగా ఉన్న సమయంలో.. మొత్తంగా చాలా తక్కువ రోజులు మాత్రమే సీతాదేవి అయోధ్యలో ఉన్నారు. కానీ అయోధ్యలో ఉండటానికి ఆ తల్లికి పూర్తి అర్హత ఉంది. కనుక కేవలం రాముని విగ్రహాన్ని మాత్రమే కాక.. సీతారాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయండంటూ’ కరణ్‌ సింగ్‌ తన లేఖలో రాశారు.

మరిన్ని వార్తలు