‘మళ్లీ సోనియాకే పార్టీ పగ్గాలు’

16 Jul, 2019 14:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాజయం ఎదురైన క్రమంలో సోనియా గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు సీనియర్లు కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం 52 స్ధానాలకు పరిమితం కావడం, ఏకంగా పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అమేథిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడం ఆ పార్టీ దుస్ధితికి అద్దం పడుతోంది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల షాక్‌తో రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం ఆ పార్టీ నేతలకు రుచించలేదు. ఇక పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ తరుణంలో తమ కుమారుడి నుంచి సోనియా గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను తిరిగి అందుకోవాలని పలువురు పార్టీ సీనియర్‌ నేతలు భావిస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

2017 డిసెంబర్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే ముందు దాదాపు రెండు దశాబ్ధాల పాటు ఆమె కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగారు. రాహుల్‌ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోయింది. మరోవైపు సోనియా గాంధీ తిరిగి పార్టీ బాధ్యతలు తీసుకుంటే వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ చెలరేగే అవకాశం ఉందని మరికొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు