లోక్‌సభ కాంగ్రెస్ నేతగా ఖర్గే

3 Jun, 2014 01:42 IST|Sakshi
లోక్‌సభ కాంగ్రెస్ నేతగా ఖర్గే

సోనియా సంచలన నిర్ణయం
44 మంది ఎంపీలకు సారథిగా ఎంపిక
స్పీకర్ గుర్తిస్తే విపక్షనేతగా గౌరవం

 
 న్యూఢిల్లీ: అందరి అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభలో 44 మంది కాంగ్రెస్ సభ్యులకు నాయకుడిగా కర్ణాటకకు చెందిన సీనియర్ నేత, రైల్వే మాజీ మంత్రి ఎం. మల్లికార్జున ఖర్గే(72)ను ఎంపిక చేశారు. దీంతో ఈ పదవి సోనియా చేపడతారా? లేక రాహుల్‌కు ఇస్తారా? అన్న సందేహాలు పటాపంచలయ్యాయి. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా ఖర్గేను సోనియా నియమించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది సోమవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అయితే, లోక్‌సభలో అత్యంత సీనియర్ అయిన కమల్‌నాథ్‌ను కాదని కర్ణాటకకు చెందిన దళిత నేత, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన ఖర్గేను లోక్‌సభాపక్ష నేతగా సోనియా ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

లోక్‌సభలో 44 మంది సభ్యులుగల కాంగ్రెస్‌నపు విపక్షంగా స్పీకర్ గుర్తిస్తే... విపక్షనేతగా ఖర్గేకు గౌరవం దక్కుతుంది. లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం స్థానాలున్న పార్టీకే విపక్షంగా గుర్తింపునకు అవకాశముంటుంది. ఇందుకు కనీసం 55 స్థానాలైనా ఉండాలి. అయితే, కాంగ్రెస్‌తో పాటు మరే పార్టీకీ అన్ని స్థానాలు లేనందున ఎక్కువ స్థానాలున్న కాంగ్రెస్‌నే విపక్షంగా స్పీకర్ గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి.


   లోక్‌సభాపక్ష నేత పదవి కోసం తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన సీనియర్ నేత కమల్‌నాథ్‌తో పాటు, మరో సీనియర్ నేత కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ కూడా పోటీ పడ్డారు. అయితే, సీనియారిటీకి తోడు, కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక నుంచి ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులు (9 మంది) ఉండడం కూడా మల్లికార్జున ఖర్గేకు అనుకూలించినట్లు తెలుస్తోంది.ఖర్గే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుల్బర్గా నుంచి రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొమ్మిది సార్లు కర్ణాటక అసెంబ్లీకి కూడా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లో 45 ఏళ్ల అనుభవం కలిగినవారు. కర్ణాటకలో హోంశాఖతో పాటు పలు శాఖలకు మంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
 
 ‘నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాం’

 దేశ విస్తృత ప్రయోజనాల కోసం అంశాల వారీగా పనిచేస్తామని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా నియమితులైన ఖర్గే తెలిపారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తామన్నారు. ప్రతిపక్షం కదా అని వ్యతిరేకంగా వ్యవహరించబోమన్నారు. అదే సమయంలో ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతామన్నారు. తనను లోక్‌సభాపక్ష నేతగా అధినేత్రి ఎంపిక చేయడంతో ఖర్గే ఢిల్లీకి బయల్దేరే ముందు బెంగళూరులో, ఆ తర్వాత ఢిల్లీలోనూ మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షురాలు, పార్టీ నేతల సూచనల ప్రకారం నడుచుకుంటానని, వారి అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు.
 

మరిన్ని వార్తలు