ఎమ్మెల్యే.. ఐఏఎస్‌.. ఓ ప్రేమకథ!

3 May, 2017 12:57 IST|Sakshi
ఎమ్మెల్యే.. ఐఏఎస్‌.. ఓ ప్రేమకథ!

తిరువనంతపురం: ఆయన ఓ రాజకీయ నాయకుడు. ఆమె ఓ ఐఏఎస్. ప్రస్తుతం ఓ జిల్లాకు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితేనేం వీరిద్దరి మనసులు కలిశాయి. ప్రస్తుతం వీళ్లు తమ ప్రేమను పెళ్లిపీటలు ఎక్కించే పనిలో ఉన్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. కేరళ మాజీ స్పీకర్, తండ్రి అయిన కార్తికేయన్ నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు కేఎస్ శబరినాథన్. గత ఎన్నికల్లో అరువిక్కర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తన ఫేస్‌బుక్ పేజీలో రిలేషన్ షిప్ స్టేటస్ కమిటెడ్ అని రాసి తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్ దివ్యా ఎస్ అయ్యర్ తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

దీంతో కొన్నేళ్లుగా వీరిద్దరిపై వస్తున్న వదంతులకు సబరినందన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. 'నాకు కావలసిన వ్యక్తులు కొన్ని రోజులుగా పెళ్లి గురించి అడుగుతున్నారు. వారికి ఇదే నా సమాధానం. ఈ విషయాన్ని చెప్పేందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సబ్ కలెక్టర్ దివ్యను తిరువనంతపురంలో కలుసుకున్నాను. మా ఇద్దరి ఆశయాలు, ఉద్దేశాలు, ఆలోచనా దృక్పథం ఒకటే కావడంతో మా పరిచయం ప్రేమగా మారింది. కొన్ని రోజుల్లో ఆమె నా భాగస్వామి కానుంది. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను' అని తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఎమ్మెల్యే శబరినాథన్ రాసుకొచ్చారు.

దివ్య ఎస్ అయ్యార్ వెల్లూరులోని సీఎంసీ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశారు. సివిల్స్ కు ప్రిపేర్ అయిన దివ్య 2013లో సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. తొలుత కొట్టాయమ్‌ జిల్లాకు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆమె ప్రస్తుతం తన సొంత జిల్లా తిరువనంతపురం సబ్ కలెక్టర్‌గా చేస్తున్నారు. సబరినందన్ పోస్టుపై మీడియా ఆమెను స్పందించగా.. మాకు అందరి ఆశీస్సులు కావాలి అంటూ పెళ్లి వార్తను కన్ఫామ్ చేసేశారు. ఎమ్మెల్యేతో పరిచయం ప్రేమగా మారిందన్నారు. వచ్చే నెలలో వీరి వివాహం జరగనుందని సమాచారం.

ఎమ్మెల్యే తండ్రిది ప్రేమ వివాహమే
కాంగ్రెస్ ఎమ్మెల్యే శబరినాథన్ తండ్రి, దివంగత నేత కార్తికేయన్. కేరళ రాజకీయాల్లో కీలకనేతగా ఉన్న ఆయన స్పీకర్‌గానూ చేశారు. తల్లి పేరు ఎంటీ సులేఖ. సులేఖ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేస్తున్న సమయంలో కార్తికేయన్ రాజకీయాల్లో ఎదుగుతున్నారు. సులేఖతో పరిచయంతో ఆమెకు ప్రపోజ్ చేశారు కార్తికేయన్. ఆమె ఒకే చెప్పారు, అయితే వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. చివరికి ఎలాగో కష్టపడి కార్తికేయన్, సులేఖ తమ ప్రేమను గెలిపించుకున్నారు. ఏ ఆటంకం లేకుండా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి కుమారుడు ఎమ్మెల్యే శబరినాథన్ ది కూడా ప్రేమ వివాహమే కానుండటం విశేషం.

మరిన్ని వార్తలు