‘అభిశంసన’పై రాజ్యాంగ ధర్మాసనం

8 May, 2018 01:08 IST|Sakshi

సీజేఐపై అభిశంసన తీర్మానం

తిరస్కరణను సుప్రీంలో సవాలు చేసిన కాంగ్రెస్‌ ఎంపీలు

పిటిషన్‌పై సీజేఐ తరువాత ఉన్న న్యాయమూర్తే నిర్ణయం తీసుకోవాలి: కపిల్‌ సిబల్‌

ప్రధాన న్యాయమూర్తి ముందే ప్రస్తావించాలన్న జస్టిస్‌ చలమేశ్వర్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని కాంగ్రెస్‌ ఎంపీలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఏకే గోయల్‌ల ధర్మాసనం పిటిషన్‌ విచారిస్తుందని సుప్రీంకోర్టు కేసుల రిజిస్ట్రీలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో ఏకే సిక్రీ ప్రస్తుతం ఆరోస్థానంలో కొనసాగుతున్నారు.

రాజ్యసభ సభ్యులు ప్రతాప్‌ సింగ్‌ బజ్వా(పంజాబ్‌), అమీ హర్షద్రాయ్‌ యాజ్ఞిక్‌లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జే చలమేశ్వర్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ ధర్మాసనం ముందు సోమవారం ఉదయం కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్, మరో సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని వారు కోరగా.. అత్యవసర విచారణ కోసం ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించాలని ధర్మాసనం వారికి సూచించింది.

ఈ సందర్భంగా మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును జస్టిస్‌ చలమేశ్వర్‌ ప్రస్తావిస్తూ.. ‘మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌పై ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అందువల్ల ఈ అంశాన్ని ఒకటో నంబరు కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావిస్తే బాగుంటుంది’ అని సూచించారు.  సీజేఐపై ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంలో సీజేఐ దుష్ప్రవర్తనను నిరూపించే ఆధారాలు ఏవీ లేవని పేర్కొంటూ నోటీసును రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించిన సంగతి తెలిసిందే.  

‘సీజేఐ నిర్ణయం తీసుకోవడం సబబు కాదు’  
అభిశంసన తీర్మానం సీజేఐకి సంబంధించింది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం సరికాదని, రాజ్యాంగ ప్రాధాన్యమున్న అంశం కావడంతో సుప్రీంలో సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తిగా మీరే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ చలమేశ్వర్‌ను సిబల్‌ కోరారు. మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు గురించి తనకు అవగాహన ఉందని, అయితే ఈ అంశంలో తక్షణ ఆదేశాలు కోరడం లేదని, వెంటనే విచారణకు స్వీకరించాలని మాత్రమే అడుగుతున్నానని ధర్మాసనానికి సిబల్‌ విజ్ఞప్తి చేశారు.

64 మంది ప్రస్తుత ఎంపీలు, ఏడుగురు మాజీ ఎంపీలతో కూడిన నోటీసును ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వెంటనే తిరస్కరించే అధికారం రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడుకు లేదని ఆయన వాదించారు. ‘దయచేసి పిటిషన్‌ స్వీకరణపై నిర్ణయం తీసుకోండి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఈ అంశాన్ని ఎవరు చేపట్టాలి.. ఎలా పరిష్కరించాలన్న దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి’ అని సిబల్‌ కోరారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ చలమేశ్వర్‌ స్పందిస్తూ.. ‘నేను రిటైర్మెంట్‌ దగ్గరలో ఉన్నాను’ అని గుర్తుచేశారు. పిటిషన్‌ను ఒకవేళ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తే సముచితంగా ఉంటుందని జస్టిస్‌ కౌల్‌ సూచించారు. న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ జోక్యం చేసుకుంటూ ‘ఈ అంశంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి సీజేఐకు అధికారాలు లేవు. సుప్రీంలోని సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’ అని ధర్మాసనాన్ని కోరారు.

మరిన్ని వార్తలు