సీఎం రేసులో ఉన్నా..

30 Sep, 2014 22:19 IST|Sakshi

సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం రాజ్ ఠాక్రే  ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమపై విశ్వాసం ఉంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)ను గెలిపిస్తే రాష్ట్రానికి నేతృత్వం వహించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై రాజ్ ఠాక్రే తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.

ఆయనను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ఓ దిష్టిబొమ్మ అంటూ అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో తనదైన శైలిలో దాదాపు అన్ని పార్టీలపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో టీవీలలో ‘కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలో మహారాష్ట్ర నెంబర్ వన్ అని పేర్కొనడంపై ఘాటుగా స్పందించారు. అభివృద్ధి, సంక్షేమంలో కాకుండా నిరుద్యోగం, అవినీతి, రైతుల ఆత్మహత్యలు తదితర విషయాల్లో మహారాష్ట్ర నెంబర్ వన్‌గా ఉందని ఎద్దేవా చేశారు.

ఇజ్రాయిల్‌లోని ఎడారి భూములను ఎలా సాగుచేస్తున్నారో తెలుసుకునేందుకు నేతలు ఇజ్రాయిల్ వెళ్లారు. కాని రాష్ట్రంలోని సాగుకు అనుకూలమైన భూములను వీరు ఎడారులుగా మార్చారని, వాటి సంగతేమిటని నిలదీశారు. ఎమ్మెన్నెస్ రూపొందించిన బ్లూప్రింట్ గురించి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామన్నారు. ‘అధికారం మాకివ్వండి.. యువతకు ఉపాధి కల్పిస్తామ’ని హామీ ఇచ్చారు. అదే విధంగా పోలీసు భర్తీ ప్రక్రియలో కూడా మార్పులు చేస్తామన్నారు. ఒక్కసారి తమకు అధికారమిచ్చి చూడంటంటూ పిలుపునిచ్చారు.

 రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి పార్టీలోనూ తిరుగుబాట్లు, జంప్ జిలానీలతో రాజకీయాలస్థాయి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారో .. అసలు  ఏ పార్టీలో ఎవరున్నారో తెలియకుండా పోతోంద’ని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు