ఘోర పరాభవం తప్పదు

27 Aug, 2014 22:30 IST|Sakshi

ముంబై: సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చోటు చేసుకున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని శివసేన జోస్యం చెప్పింది. శాసనసభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటమి తప్పదని పేర్కొంది. ఒకవైపు ఆ రెండు పార్టీలు సీట్ల పంపకంపై గొడవ పడుతూనే, పొత్తు లేకుండా విజయం సాధిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నాయని శివసేన తన దినపత్రిక సామ్నా సంపాదకీయంలో ఎద్దేవా చేసింది. వారి కలిసి పోటీ చేసినా, విడి విడిగా బరిలోకి దిగినా ఓటమి ఖాయమని స్పష్టం చేసింది.

సీట్ల కోసం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య జరుగుతున్న కుమ్ములాటలు మహారాష్ట్ర ప్రజలకు వినోదాన్ని పంచి పెడుతున్నాయని పేర్కొంది. ఆ రెండు పార్టీలు అవకాశం లభించినప్పుడల్లా ఒకదాని పుట్టి ముంచేందుకు మరొకటి ప్రయత్నిస్తూనే ఉంటాయని, అయినప్పటికీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం విస్మయం కలిగిస్తోందని సేన పేర్కొంది. కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి చాలా మంది నాయకులు ఇటీవలి కాలంలో శివసేనలో చేరారని తెలిపింది.

 శివసేనలోకి వలస వెళుతున్న నాయకులను ఎలా నియంత్రించాలో ఆ పార్టీలకు తెలియడం లేదని ఎద్దేవా చేసింది. లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే ఆ రెండు పార్టీలు మరోసారి ఘోరంగా ఓడిపోక తప్పదని ధీమా వ్యక్తం చేసింది. పృథ్వీరాజ్ చవాన్, మాణిక్‌రావ్ ఠాక్రే, నారాయణ్ రాణే, అజిత్ పవార్, జయంత్ పాటిల్, ఆర్‌ఆర్ పాటిల్ వంటి పెద్ద నాయకులు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చింది. అప్పుడే వారికి ఓటమిని రుచి చూపించే అవకాశం మహారాష్ట్రకు దక్కుతుందని సామ్నా పేర్కొంది.

మరిన్ని వార్తలు