సీఎం అభ్యర్థుల ప్రకటన ఆలస్యం!

13 Dec, 2018 19:03 IST|Sakshi

న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చిక్కొచ్చిపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో కాంగ్రెస్‌ అధిష్టానానికి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ సీఎంల ఖరారుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీఎం పదవి ఆశావహులు గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసానికి వచ్చారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా రాహుల్‌ నివాసానికి వచ్చారు. ఇదివరకు ఏ సమావేశం జరిగినా 10 జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసంలో జరిగేది. కానీ ఈసారి మూడు రాష్ట్రాల సీఎంల ఎంపిక కసరత్తంతా రాహుల్‌ నివాసంలోనే జరుగుతోంది. రాజస్థాన్‌ సీఎం పదవి కోసం అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌.. మధ్యప్రదేశ్‌ సీఎం పదవి కోసం కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్యల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నలుగురితో విడివిడిగా రాహుల్‌ గాంధీ మాట్లాడారు.

యువనేతలు సచిన్‌ పైలట్‌, జ్యోతిరాదిత్యలకు డిప్యూటీ సీఎం పదవులు ఆఫర్‌ చేసినా వారు ఆ పదవులను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికల్లో తాము కష్టపడితే సీనియర్లకు పదవులిస్తారా అంటూ సచిన్‌, జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సీఎం రేసులో నుంచి తప్పుకోవడానికి యువనేతలు నిరాకరిస్తుండటంతో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని రాహుల్‌ గాంధీ వారికి సర్దిచెప్పినట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు