19 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ నోటీసులు

16 Jul, 2020 13:22 IST|Sakshi

జైపూర్‌: సచిన్‌  పైలట్‌ తిరుగుబాటుతో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కీలక సమావేశాలకు హాజరుకాని 19 పార్టీ ఎమ్మెల్యేకు అధికార పార్టీ‌ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్  అధ్యక్షతన శాసనసభాపక్షం జైపుర్‌లోని ఫెయిర్‌మోంట్‌ హాటల్‌లో రెండోసారి సమావేశమయ్యింది. ఈ భేటీకి హాజరు కాని సచిన్‌తో పాటు ఆయన వర్గంగా భావిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు రాజస్తాన్ కాంగ్రెస్ ఇంచార్జి అవినాశ్ పాండే ప్రకటించారు. సీఎల్పీ సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని, లేని పక్షంలో అనర్హత వేటు వేస్తామని నోటీసులో పేర్కొన్నారు. (హరియాణాలో పైలట్‌ బృందం.. కపిల్‌ సిబాల్‌ స్పందన)

సమావేశానికి గైర్హాజరైన సభ్యులకు ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌, ఈ మెయిల్‌తో పాటు పోస్టు ద్వారా కాంగ్రెస్‌ నోటీసులు పంపింది. అంతేగాక హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో నోటీసులను వారి ఇంటి ముందు ఉన్న గోడలపై అతికించారు. పార్టీ సభ్యులు కొంత మంది ఉద్ధేశపూర్వకంగానే సీఎం సమావేశానికి హాజరుకాలేదని జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. కాగా కాంగ్రెస్‌ పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్‌ పైలట్‌ సోమ, మంగళవారాల్లో జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరుకాని విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను పీసీసీ చీఫ్‌, ఉప ముఖ్యమంత్రి పదవులను నుంచి తొలగిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. (అసెంబ్లీ టికెట్‌ కోసం రూ.38లక్షలు వసూలు)

మరిన్ని వార్తలు