‘అక్రమ మార్గాల్లో అధికారంలోకి’

31 Mar, 2017 22:17 IST|Sakshi
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌ శుక్రవారం రాజ్యసభకు హాజరుకావడంపై విపక్ష కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. పార్టీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. జీరో అవర్‌లో పరీకర్‌ సభకు రాగానే దిగ్విజయ్‌ సింగ్‌, బీకే హరిప్రసాద్‌ తదితరులు లేచి నిలబడి నిరసన తెలిపారు. గోవా ఎన్నికల్లో మెజారిటీ రాకున్నా బీజేపీ అక్రమ మార్గాల్లో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. గోవా పగ్గాలు చేపట్టేందుకు పరీకర్‌ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.
 
సభ్యులు లేకుండా ఎలా కొనసాగిస్తారు?
 
సభలో తగినంత మంది సభ్యులు లేకున్నా ప్రభుత్వం సభా కార్యక్రమాలను కొనసాగిస్తోందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యా‍హ్నం సభలో విపక్ష సభ్యులు లేకపోవడాన్ని సాకుగా తీసుకుని వివాదాస్పద బిల్లులను సర్కారు ముందుకు తీసుకెళ్లడమేమిటని ప్రశ్నించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ స్పందిస్తూ.. విపక్ష సభ్యులు సభలో ఉండేలా చూడడం తన బాధ్యత కాదన్నారు. ప్రైవేటు సభ్యుల కార్యకలాపాలు ముగియగానే శత్రు ఆస్తుల బిల్లును చేపడతామన్నారు. ఏకాభిప్రాయం లేకుండా దీనిపై చర్చ ఉండదని ప్రభుత్వమే చెప్పిందంటూ ఆజాద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
లోక్‌పాల్‌ నియామకమేదీ?
 
లోక్‌పాల్‌ను ఇంతవరకూ ఎందుకు నియమించలేదని రాజ్యసభలో సీపీఎం సభ్యుడు తపన్‌కుమార్‌ సిన్హా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం పూనుకుంటే ఆర్డినెన్స్‌ ద్వారా ఈ పోస్టును భర్తీ చేయొచ్చన్నారు. మంత్రి నక్వీ సమాధానమిస్తూ.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు.
 
జనపనార సంచులు వాడండి
 
వరి, కూరగాయలను జనపనార సంచుల్లో ప్యాక్‌ చేయాల్సిందిగా పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలను కోరతామని జౌళి మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభకు తెలిపారు. జనపనార రైతులకు అధీకృత విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
 
రాజ్యసభకు 4 రోజుల సెలవు
 
రాజ్యసభకు శనివారం నుంచి 4 రోజులు సెలవు ప్రకటించారు. శని, ఆది సాధారణ సెలవు రోజులు కాగా మంగళవారం శ్రీరామనవమి కావడంతో ఆరోజు, పండగ సందర్భంగా అదనంగా సోమవారం సెలవుగా ప్రకటించారు. సభ బుధవారం తిరిగి సమావేశమవుతుంది.
 
మరిన్ని వార్తలు