రాణేకు సోనియా పిలుపు

24 Jul, 2014 23:47 IST|Sakshi

 సాక్షి, ముంబై: కొద్ది రోజులుగా పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణేకు ఎట్టకేలకు హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆ మేరకు రాణే గురువారం మధ్యాహ్నం ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. గత సోమవారం రాణే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

దీంతో రాణేని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే మంగళవారం వర్షా బంగ్లాలో రెండు గంటలపాటు రాణేతో సమావేశం నిర్వహించారు. బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. చివరకు అవి కూడా విఫలం కావడంతో ఈ విషయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళతామని, రెండు, మూడు రోజుల్లో సోనియాతో ముగ్గురం భేటీ అవుతామని చవాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాని రాణే ఒక్కరే ఢిల్లీకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 రాణేతో ఒంటరిగానే చర్చలు జరుపుతారా..? లేక ఢిల్లీలో ఉన్న నాయకులను ఆహ్వానించి నచ్చజెప్పే ప్రయత్నమేదైనా చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలాఉండగా తిరుగుబాటుపై రాణే కొంత శాంతించినప్పటికీ పరువును కాపాడుకునేందుకు మాత్రం సోనియాతో తప్పకండా భేటీ కావాల్సిందే. కాగా ఆయన పార్టీలోనే కొనసాగుతారని. బహుశా రాజీనామా కూడా ఉపసంహరించుకుంటారని బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, కొన్ని నెలలుగా క్రమంగా తరిగిపోతున్న తన ప్రాభవాన్ని మళ్లీ పుంజుకోవడానికి రాణే ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు యత్నించవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


 రాహుల్‌తో సమావేశం
 న్యూఢిల్లీ : మహారాష్ర్ట కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు నారాయన్ రాణే గురువారం తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీకి నాయకత్వ మార్పు అవసరంపై చర్చించారు. శుక్రవారం మహారాష్ర్ట సీఎం పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ రాష్ర్ట అధ్యక్షుడు మాణిక్‌రావ్ థాక్రేతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసే అవకాశం ఉంది.  కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా ఉండేందుకు నాయకత్వం మార్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు