144 సీట్లు ఇవ్వాల్సిందే

24 Jul, 2014 23:52 IST|Sakshi

 సాక్షి, ముంబై :  ఎన్సీపీకి 144 సీట్లు ఇవ్వాల్సిందేనని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు సునీల్ తట్కరే స్పష్టం చేశారు. సీట్ల పంపకాల అంశంపై ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల అంశం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ విషయమై గురువారం ఎన్సీపీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీట్ల పంపకాల అంశంపై సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించిందని తెలిపారు. ఈ సమావేశంలో 144 సీట్లు కేటాయించాల్సిందేనని పట్టుబట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే తదితర ప్రముఖులు పాల్గొని,  తమ ప్రతిపాదనలు, డిమాండ్లను ఎన్సీపీ ముందుంచినట్లు చెప్పారు. ఈ విషయాలపై కాంగ్రెస్ మహారాష్ట్ర ఇంచార్జీ మోహన్‌ప్రకాష్ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్‌తో చర్చిస్తారు. వీరిద్దరి చర్చల అనంతరం మరో రెండు మూడు రోజుల్లో సీట్ల పంపకాల విషయంపై మళ్లీ సమావేశం జరగనుందని చెప్పారు. ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సునీల్ తట్కరే తెలిపారు. మరోవైపు రమేష్ కదం ఎన్సీపీలో చేరికతో కోంకణ్‌లో ముఖ్యంగా చిప్లూన్‌లో ఉత్సాహమైన వాతవరణం నెలకొందన్నారు.

 ఇక రాణే విషయంపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు.  ఢిల్లీ మహారాష్ట్ర సదన్‌లోని సంఘటనపై మాత్రం రాష్ట్ర సంస్కతి, సాంప్రదాయలకు వ్యతిరేకమైన సంఘటనగా పేర్కొంటూ శివసేనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రజాసామ్య కూటమిలో జతకట్టనుందన్న విషయంపై ఇంత వరకు ఎలాంటి ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు