‘ఆ అయిదు పథకాల పేర్లు మారాయి’

12 Feb, 2019 11:49 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ప్రభుత్వాలు మారగానే కీలక విధానాల సంగతి ఎలా ఉన్నా ప్రముఖ పథకాలు, ప్రాజెక్టుల పేర్లు మారుతుంటాయి. ఇదే ఒరవడిలో చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి భూపేశ్‌ బఘేల్‌ సారథ్యంలో నూతనంగా కొలువుతీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త, దివంగత జన సంఘ్‌ నేత పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పేరుతో ఉన్న 5 పధకాల పేర్లు మార్చింది. పురపాలక, అభివృద్ధి శాఖలకు చెందిన ఈ పధకాలకు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ల పేర్లు పెట్టారు.

ఆయా పధకాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం సోమవారం రాత్రి నోటికేషన్‌ జారీ చేసిందని ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యా స్వావలంభన యోజన పథకాన్ని రాజీవ్‌ గాంధీ స్వావలంభన యోజనగా, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ సర్వసమాజ్‌ మంగళ భవన్‌ను ఇక నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సర్వసమాజ్‌ మంగళభవన్‌గా వ్యవహరిస్తారు. కాగా పండిట్‌ దీన్‌దయాళ్‌ శుద్ధి  నీటిని ఇకమీదట ఇందిరా ప్రియదర్శిని శుద్ధ పేజల్‌గా పిలుస్తారు.

కాగా అభివృద్ధి పధకాల పేర్ల మార్పు నిర్ణయాన్ని చత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం, బీజేపీ నేత రమణ్‌ సింగ్‌ ఖండించారు. చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పేర్ల మార్పు తతంగానికి నిరసనగా తాము ఆందోళనల బాట పడతామని చత్తీస్‌గఢ్‌ మాజీ సీయం, బీజేపీ నేత రమణ్‌ సింగ్‌ వాపోయారు. ప్రభుత్వ తీరుపై తాము చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని రమణ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మెంటాలిటీకి చత్తీస్‌గఢ్‌ సర్కార్‌ తీరు నిదర్శమని ఆయన చెప్పకొచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు