‘మోదీజీ..గూగుల్‌ సెర్చ్‌ చాలు’

23 Dec, 2019 08:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలు తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని..భారత్‌లో డిటెన్షన్‌ సెంటర్లు లేవని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ దీటుగా బదులిచ్చింది. మోదీ అసత్యాలను దేశ ప్రజలు పసిగట్టలేరని ఆయన భావిస్తున్నారని కౌంటర్‌ ఇస్తూ గూగుల్‌ సెర్చ్‌ ద్వారా మోదీ అవాస్తవాలను బట్టబయలు చేయవచ్చని పేర్కొంది. డిటెన్షన్‌ సెంటర్లు పనిచేస్తున్నాయని, ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకూ ఇవి కొనసాగుతాయని  ఆ పార్టీ ట్విటర్‌లో పేర్కొంది. అసోంలోని డిటెన్షన్‌ కేంద్రాల్లో 28 మంది అక్రమ వలసదారులు మరణించారని కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ చెప్పినట్టు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాన్ని సైతం కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

కాగా, ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. ముస్లింలను అణిచివేతకు గురిచేసే విధంగా వారికి పౌరసత్వాన్ని నిరాకరించి డిటెన్షన్‌ సెంటర్లకు పంపేందుకే ఈ చట్టం తీసుకొచ్చారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క ముస్లింనూ డిటెన్షన్‌ సెంటర్లకు పంపబోమని, అసలు భారత్‌లో అలాంటి కేంద్రాలు లేవని స్పష్టం చేశారు. అవాస్తవాలను కొందరు ఈ స్ధాయిలో ప్రచారం చేయడం తనను షాక్‌కు గురిచేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వరుసగా రెండుసార్లు ప్రధాని పగ్గాలు చేపట్టడంతో నిరాశకు లోనయిన విపక్షాలు, అర్బన్‌ నక్సల్స్‌ పౌరసత్వ సవరణ చట్టంపై తప్పుడు ప్రచారానికి దిగాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు